TDP Chandra Babu : 175 స్థానాల్లో గెలవడం కాదు, జగన్ జైలుకెళ్లడం ఖాయం… చంద్రబాబు
TDP Chandra Babu రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీకి ఓటమి తప్పదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, జగ్గయ్యపేట నియోజక వర్గాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించి బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో టీడీపీకి గట్టి పట్టు ఉన్న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ప్రజలు చంద్రబాబు పర్యటనకు తరలిరావడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు బాబు రోడ్ షో కొనసాగింది.
TDP Chandra Babu రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జోశ్యం చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. రాష్ట్రంలో అన్నింటిపై బాదుడే బాదుడు ఉందని ఆరోపించారు. కరెంట్ బిల్లుల నుంచి ఇంటి పన్నుల వరకు అన్నీ పెంచేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. చెత్తపైనా పన్ను వేస్తున్న చెత్త ప్రభుత్వం ఇదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక దోపిడి తో ఎమ్మెల్యేలు అక్రమార్జన చేస్తున్నారని జగ్గయ్యపేటలో చంద్రబాబు ఆరోపించారు.
ఆడబిడ్డల మంగళసూత్రాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన జగన్ కు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు ఉందా అని ప్రశ్నించారు. కాలేజ్ ఫీజులు నేరుగా కాలేజ్ లకు కట్టకపోవడం వెనుక కూడా జగన్ అక్రమార్జన వ్యూహం ఉందని ఆరోపించారు. పేదల కడుపులు నింపేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లపై కక్ష పెంచుకున్నారని, అన్న క్యాంటీన్ ఏం పాపం చేసిందని రద్దు చేశాడని ప్రశ్నించారు. టిడిపి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ పెడతామన్నారు. నాడు 200 పెన్షన్ 2000 అయ్యిందిని, టిడిపి వచ్చి ఉంటే 3000 అయ్యేదని చెప్పారు.
జగన్‌కు వచ్చే ఎన్నికల్లో 175 రావడం కాదు కదా, ఎన్నికల అనంతరం జగన్ జైలకు వెళ్లడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. వైసిపి బంగాళాఖాతంలో కలిసి పోతుందని, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనతో తిండి తినే పరిస్థితి కూడా లేదన్నారు. రైతులు తీవ్రంగా నష్టపోయారని, నియోజక వర్గంలో మిరప పంట 3500 ఎకరాలు ఇక్కడ దెబ్బతింటే, కనీసం పరిహారం ఇవ్వలేదన్నారు. ధాన్యం డబ్బులు కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు.
ప్రభుత్వం ఒక్క రైతుకు సబ్సిడీ ఇవ్వలేదని, టీడీపీ హయాంలో ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు ఇచ్చామన్నారు. వ్యవస్థలు కుప్ప కూలడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాలు పెరిగాయని ఆరోపించారు. పులివెందులలో బస్ స్టాండ్ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అమరావతిని కూడా హైటెక్ సిటీ స్థాయికి తీసుకెళ్లాలనుకున్నానని చెప్పారు.
అంతా అమరావతిలో ఉద్యోగాలు చేసుకోవాలని, కలలు కన్నానని, జగన్ అమరావతిలో 2 లక్షల కోట్ల సంపద తగలబెట్టాడని చంద్రబాబు ఆరోపించారు. 70 శాతం పూర్తి అయిన పోలవరం ఈపాటికి పూర్తై ఉంటే మంచి ప్రయోజనాలు ఉండేవన్నారు. పోలవరాన్ని సిఎం గోదావరిలో ముంచేశాడని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చాడా, రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఉందా అని ప్రశ్నించిన చంద్రబాబు, జగన్ యువతకు ఇచ్చింది వాలంటరీ ఉద్యోగమని ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి హయాంలో యువతకు ఉద్యోగాలు రావని, మళ్లీ ఉద్యోగాలు రావాలి అంటే టిడిపి అధికారంలోకి రావాలన్నారు. మళ్లీ వైసిపి వస్తే పిల్లల భవిష్యత్ అంధకారమే అని, నాడు నేడు అని 6 వేల స్కూళ్లు మూసేశాడని ఆరోపించారు. ఇంగ్లీషు మీడియం అని చెప్పి చివరికి స్కూళ్లు మూసేశాడని, ప్రతిష్టాత్మక యూనివర్శిటీలకు కనీసం రోడ్లు కూడా వేయలేదని ఆరోపించారు.
అభివృద్ది లేకపోతే సంపద సృష్టి ఎలా జరుగుతుందని, పేదలకు ఎలా మేలు జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమృద్దిగా వనరులు ఉన్నా...అల్లుడి నోట్లో శని అన్నట్లు పాలన ఉందన్నారు. కుప్పం వెళితే తన మీటింగ్ కు అడ్డంకులు సృష్టించారని, 70 మంది టిడిపి కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టారని చంద్రబాబు చెప్పారు. కార్యకర్తల కోసం మొదటి సారి జైలుకు వెళ్లానని, ప్రజా స్వామ్యం కోసం కుప్పం తమ్ముళ్లు జైలుకు వెళ్లారని, తప్పుడు కేసులు పెట్టే పోలీసులపైనా ప్రైవేటు కేసులు పెడదామని చెప్పారు. సోషల్ మీడియాకు, సిఐడికి ఏమిటి సంబంధం అని వాళ్లు కేసులు పెట్టడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడుకుందామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత బిసిలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.