TDP Mahanadu 2025 : జగన్ ఇలాకాలో టీడీపీ మహానాడు.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
TDP Mahanadu 2025 : మహానాడు అంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలందరికి పెద్ద పండుగ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28న టీడీపీ ఏటా మహానాడును నిర్వహిస్తుంది. ఈసారి వైసీపీ చీఫ్ జగన్ సొంత జిల్లా కడపలో మహానాడును నిర్వహించాలని.. సైకిల్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమాన్ని.. ఈసారి రాయలసీమలో నిర్వహించనున్నారు. 2025 మహానాడును ఈసారి కడపలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. మే 27, 28 తేదీల్లో మహానాడు జరిగే అవకాశం ఉంది. జగన్ సొంత జిల్లాల్లో మహానాడును నిర్వహించాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మొదటి మహానాడు గుంటూరులో..
1982లో తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహన్ని కొనసాగిస్తూ.. 1983 మే 26, 27, 28 తేదీల్లో గుంటూరులో తొలి మహానాడును నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జరుపుకొన్న తొలి మహానాడు ఇదే. అప్పట్లో వైభవంగా మహానాడును నిర్వహించారు.
పేరు పెట్టింది పెద్దాయనే..
మహానాడు అనే పదం.. తెలుగుదేశం పార్టీకి సంబంధించి విషయాల్లో మినహా.. మరెక్కడా కనిపించదు. మహానాడు అనే పేరు పెట్టింది సీనియర్ ఎన్టీఆర్. టీడీపీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు అందరూ మహానాడుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మహానాడులో కార్యకర్తల మొదలు.. అధ్యక్షుడి వరకు అంతా కలసి తీర్మానాలను ఆమోదిస్తారు. పార్టీ ఆరంభం నుంచి ఈ సాంప్రదాయం వస్తోంది.
భోజనాలు చాలా స్పెషల్..
మహానాడుకు వచ్చే అతిథులు, కార్యకర్తల కోసం ప్రత్యేక వంటకాలతో భోజనాలు పెడతారు. వంటలు చేయడానికి దాదాపు వెయ్యిమందిని నియమిస్తారు. ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. ఈ వేడుకుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కడుపు నిండా తినేలా వంటల్ని సిద్ధం చేస్తారు. ఈసారి మహానాడుకు దాదాపు 6 లక్షల మందికిపైగా కార్యకర్తలు వస్తారని అంచనా వేస్తున్నట్టు టీడీపీ సీనియర్ నేత ఒకరు 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు'కు చెప్పారు.
ఇవి కామన్..!
మహానాడు లంచ్‌లో.. అజ్వాన్ పకోడి, కొబ్బరి అన్నం, జిలేబీ, యాపిల్ హల్వా, కడాయి వెజిటబుల్ కుర్మా, రైతా, మామిడికాయ పప్పు, వంకాయ పకోడి ఫ్రై, మునగకాయ, బీన్స్ కర్రీ, పచ్చి పులుసు, మజ్జిగచారు, సాంబారు, మామిడికాయ పచ్చడి, దోసకాయ చట్నీ, అప్పడాలు, పెరుగు, వైట్ రైస్, నెయ్యి, ఐస్ క్రీమ్ వంటివి వడ్డిస్తారు.
ప్రత్యేకంగా ఇంఛార్జ్‌లు..
అల్పాహారంగా.. టీ, కాఫీలు, నేరేడు హల్వా, ఇడ్లీ, గారె, పొంగల్, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కారప్పొడి, నెయ్యి, సాంబారు వంటివి ఇస్తారు. ప్రతి ఏడాది మహానాడు కోసం ప్రత్యేకంగా మోనూ తయారు చేసి.. ఫుడ్ సెక్షన్ ఇంఛార్జ్‌లను నియమిస్తారు. ఆ నేతలు భోజనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.