Kolikapudi Srinivasa Rao : టీడీపీకి తలనొప్పిగా ఎమ్మెల్యే కొలికపూడి, రేపు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని ఆదేశాలు
Kolikapudi Srinivasa Rao : టీడీపీకి ఎమ్మెల్యేలతో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఒకరి తర్వాత ఒకరు వివాదాస్పదం అవుతున్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చాలా ఫిర్యాదు రావడంతో టీడీపీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది.
Kolikapudi Srinivasa Rao : రాష్ట్రంలో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి ఎమ్మెల్యేలతో తలనొప్పి వచ్చి పడింది. ఒక ఎమ్మెల్యే తరువాత ఒకరు వివాదస్పదం అవుతున్నారు. టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వైఖరిని పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో ఆయనపై చర్యలు తప్పవంటూ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. రేపు (సోమవారం) పార్టీ క్రమ శిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని ఆయనకు ఇప్పటికే సమాచారం అందించారు. దీంతో ఆయనపై చర్యలకు పార్టీ ఉపక్రమించిందని టీడీపీ వర్గాలు తెలిపాయి.
అధికార టీడీపీ, జనసేనలకు పార్టీ ఎమ్మెల్యేల వైఖరితో తిప్పలు తప్పటం లేదు. టీడీపీలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా పార్టీకి తలనొప్పిగా మారారు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సె* స్కాండల్‌లో ఇరుక్కుని సస్పెన్షన్‌కు గురయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీష్ అవినీతి అక్రమాలతో సస్పెండ్ అయ్యారు. మంత్రులు కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, కింజరపు అచ్చెన్నాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ తదితరులు వివిధ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయా ఘటనలతో అధికార పార్టీపై, ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి.
అయితే వీరందరిలో టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అంశం భిన్నమైనది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక వివాదంలో ఆయన ఉంటున్నారు. రైతులను కుక్కలతో పోల్చిన వ్యాఖ్యలు వివాదం అయ్యాయి. అలాగే మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఎ.కొండూరు మండలం కంభంపాడులో అక్రమ నిర్మాణమంటూ ఒక ఇంటిని ఎమ్మెల్యే దగ్గరుండి కూలగొట్టించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చిట్యాల సర్పంచిపై ఎమ్మెల్యే చిందులు వేయడం, వీఆర్ఏగా ఉన్న సర్పంచ్ భార్యతోనూ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్ భార్య పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అలాగే తన నియోజకవర్గంలో మద్యం బెల్ట్ షాపులను వ్యతిరేకిస్తూ సొంత పార్టీ వ్యక్తులపైనే విమర్శలు చేశారు. అలాగే స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్‌ను ఆయన పట్టించుకోకుండా అనుసరిస్తున్న వైఖరితో పార్టీకి నష్టం జరుగుతోందని ఆ పార్టీ భావించింది. క్యాడర్ కూడా పదేపదే ఫిర్యాదుల చేశారు.
దీంతో ఆయనకు అనేక సార్లు పార్టీ అధిష్టానం హెచ్చరించింది. అయినప్పటికీ ఆయన పార్టీ అధిష్టానం మాటను కూడా పెడచెవిని పెట్టారు. ఆయన వైఖరిలో మార్పు రాకపోవడంతో ఆయనను పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఇటీవల నియోజకవర్గంలోని గోపాలపురం గ్రామంలో సిమెంట్ రోడ్ వివాదంలో ఆయన జోక్యం చేసుకోవడంతో ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. ఈ వివాదంతో పాటు ఆయన పార్టీకి నష్టం చేసేలా అనేక సార్లు వ్యాఖ్యలు, చర్యలు చేపట్టారు. వీటన్నింటిపై వివరణ ఇవ్వాలని ఆయనకు టీడీపీ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది.
రాజధాని అమరావతి ఉద్యమంలో కీలకంగా పని చేశారనే ఒకే ఒక కారణంతో కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ నుంచి కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ టిక్కెట్‌ను చంద్రబాబు కేటాయించారు. ఆయన అనూహ్యంగా విజయం సాధించారు. అయితే ఆయన వరుసగా వివాదాలకు కేంద్రంగా ఉడటంతో పార్టీకి తలనొప్పులు తీసుకువచ్చారు. అధికారులను బెదిరించడంతో పాటు టీడీపీ క్యాడర్‌తోనూ ఆయన గొడవలు పడుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.
ఒక మహిళ తనతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేసింది. అప్పట్లోనే ఆయనపై చర్యలకు ఉపక్రమించడానికి పార్టీ సిద్ధపడింది. సీఎం చంద్రబాబు స్వయంగా పిలిచి చీవాట్లు పెట్టారు. పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఆ తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని సమన్వయ కమిటీ ముందుకు పిలిచి వివరణ అడిగారు. అయితే ఆయన తాను తప్పులు సరిదిద్దుకుంటానని, తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరిగాయని పార్టీకి తెలిపారు. దీంతో ఆయనను నియోజకవర్గానికి రెండు నెలల పాటు దూరంగా ఉండాలని పార్టీ సూచించింది. తరువాత మళ్లీ వివాదాలు ప్రారంభించడంతో హైకమాండ్ అసంతృప్తికి గురయింది.
ప్రభుత్వ సలహాదారు ఎంఎ షరీఫ్, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణలతో కూడిన క్రమ శిక్షణ కమిటీ ఎదుట సోమవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరుకానున్నారు. ఈసారి ఆయనపై చర్యలు తప్పవని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన ఎటువంటి వివరణ ఇచ్చినా ఏదో ఒక చర్య అయితే తీసుకుంటారని తెలిపాయి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం