AP Nominated Posts : ఒక్క ఛాన్స్ ప్లీజ్..! నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు, ముందుగా దక్కేది వారికేనా..?-tdp leaders are applying for nominated posts in ap govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Nominated Posts : ఒక్క ఛాన్స్ ప్లీజ్..! నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు, ముందుగా దక్కేది వారికేనా..?

AP Nominated Posts : ఒక్క ఛాన్స్ ప్లీజ్..! నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు, ముందుగా దక్కేది వారికేనా..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 17, 2024 07:32 AM IST

అధికార తెలుగుదేశానికి చెందిన నేతలు నామినేటెడ్ పోస్టులపై కన్నేశారు. సీఎం చంద్రబాబు కూడా ఇటీవలే పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో…. టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకుంటున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల వరకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు (ఫైల్ ఫొటో)
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు (ఫైల్ ఫొటో) (Photo From TDP Facebook Account)

ప్రభుత్వ శాఖల్లో నామినేటెడ్‌ పదవుల కోసం టీడీపీ కార్యాలయానికి భారీగా దరఖాస్తులు చేరుకున్నాయి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పదవుల కోసం నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోం తమ దరఖాస్తులను పార్టీకి అందజేస్తున్నారు. పార్టీలో తాము చాలా కష్టపడ్డామని.. ఆర్థికంగా నష్టపోయామని, తమపై కేసులు కూడా ఉన్నాయని దరఖాస్తుల్లో చూపుతున్నారు.

తమ వివరాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్‌ నేతల సిఫార్సుల లేఖలను కూడా వీటికి జత చేస్తున్నారు. నామినేటెడ్‌ పదవులు కేటాయించాలని ఇప్పటి వరకు సుమారు 23 వేల దరఖాస్తులు పార్టీ కార్యాలయానికి వచ్చాయి. భారీగా దరఖాస్తులు రావడంతో వీటిని వడపోసే కార్యక్రమాన్ని పార్టీ అధినాయకత్వం చేపట్టింది. అందరికీ ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై తీవ్ర కసరత్తు చేస్తోంది.

వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు పది మందితో కూడిన ఒక కమిటీని పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ప్రోగ్రామ్స్‌ కమిటీ నుంచి వచ్చిన దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ వద్దకు తీసుకెళ్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వడపోత తరువాత ఎవరికి ఏ పదవులు దక్కుతాయో స్పష్టత ఉంటుందని అంటున్నారు.

వీరికే తొలి ప్రాధాన్యత…!

తెలుగుదేశం-బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన నేతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని టిడిపి అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా 31 మంది నేతలు తమ సీట్లను త్యాగం చేశారు. వీరితోపాటు ఇతరుల కోసం సీట్లు త్యాగం చేసిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ తరువాత పార్టీకి ఆర్థికంగా విరాళాలు అందించిన వారిని కూడా పరిశీలించాలని చూస్తోంది.

సెప్టెంబర్ లోపు పూర్తి…!

నామినేటెడ్‌ పదవుల మొత్తాన్ని సెప్టెంబరులోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా… ఇప్పటి వరకుఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీంతో చాలా మంది నేతలు అసంతృప్తికి లోనవుతున్నారట..! ఇదే విషయం పార్టీ అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పదవులను భర్తీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.

తొలిదశ జాబితా వారంలోపు వచ్చే అవకాశం ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో సుమారు 103 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఛైర్మన్‌తోపాటు 11 మందికి డైరెక్టర్లుగా నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది. తద్వారా 1,130 మంది వరకు నామినేట్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో 300 పదవులు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు, మండల స్థాయిలో మార్కెట్‌ యార్డు కమిటీ పదవులు కూడా ఉన్నాయి. మొత్తం సుమారు 2,500 మందికి నామినేటెడ్‌ పదవులు దక్కే అవకాశం ఉంటుందని నేతలు చెబుతున్నారు.

ఈ పదవులను దక్కించుకునే అదృష్ట నేతలెవరో అంటూ పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ కోసం కష్టపడిన తమను తప్పకుండా గుర్తించాలని నేతలు, కింది స్థాయిలోని కార్యకర్తలు మాత్రం అధినాయకత్వాన్ని కోరుతున్నారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.