Kurnool Murder: కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నాయకుడు వాకిటి శ్రీను దారుణ హత్య-tdp leader vakiti srinu brutally murdered in pattikonda kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Murder: కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నాయకుడు వాకిటి శ్రీను దారుణ హత్య

Kurnool Murder: కర్నూలు జిల్లా పత్తికొండలో టీడీపీ నాయకుడు వాకిటి శ్రీను దారుణ హత్య

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 10:21 AM IST

Kurnool Murder: కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకుడు దారుణహత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన టీడీపీ మండల నాయకుడు వాకిటి శ్రీనును గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు కారణమైంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

టీడీపీ నాయకుడి మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు
టీడీపీ నాయకుడి మృతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

Kurnool Murder: కర్నూలు జిల్లా ప్రత్తిపాడు మండలం హోసూరులో టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ వాకిటి శ్రీను హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గ్రామంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరపున పనిచేసిన శ్రీనును ప్రత్యర్థులు కాపుగాచి మట్టుబెట్టడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.

ప్రత్తిపాడు నియోజక వర్గంలోని హోసూరులో 2019ఎన్నికలలో వైసీపీ అభ్యర్థికి 2వేల ఓట్ల మెజార్టీ వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ వచ్చింది. గ్రామంలో వైసీపీ ఆధిపత్యానికి గండి పడటానికి శ్రీను కారణమని వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నట్టు గ్రామస్తులు ఆరోపించారు. వాకాటి శ్రీను మరణం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ నాయకులే శ్రీనును హత్య చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. 

తాజాగా వాకిటి శ్రీనుకు నియోజక వర్గ స్థాయిలో నామినేటెడ్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. శ్రీను ఎదుగుదల తట్టుకోలేక వైసీపీ నాయకులు హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జామున ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనుపై ప్రత్యర్థులు కాపుకాచి దాడి చేశారు. బహిర్భూమికి వెళ్లిన సమయంలో మాటువేసిన దుండగులు వెనుక నుంచి తలపై దాడి చేశారు. 

ఐదారుగురు కలిసి విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో నలుగురి నుంచి ఆరుగురి వరకు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో ఆధారాలు దొరక్కుండా కారం పొడి చల్లారు. మృతుడి కుటుంబీకులను ఎమ్మెల్యే కేఈ శ్యామ్‌ పరామర్శించారు. ఘటనా స్థలానికి కొంత దూరంలో దుండగులు మాటు వేసినట్టు ఆధారాలను గుర్తించారు. సంఘటనా స్థలంలో బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డాగ్స్‌ టీమ్‌‌తో గాలింపు చేపట్టారు. ఘటనా స‌్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని లోకేష్ ఆరోపించారు.

ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనా.. జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు.