Nara Lokesh Delhi Tour : చంద్రబాబు అరెస్టుపై ఢిల్లీకి నారా లోకేశ్ - విషయం ఇదేనా..?
Nara Lokesh Delhi Tour:'చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలోని పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించటంతో పాటు… చంద్రబాబు కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు.
Nara Lokesh Delhi Tour: చంద్రబాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు చంద్రబాబు కేసు వ్యవహారంపై కోర్టుల్లో విచారణ జరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో…. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాజమహేంద్రవరంలో చంద్రబాబును ములాఖాత్ ద్వారా కలిసిన ఆయన… అనంతరం హస్తినకు బయల్దేరారు. రాష్ట్రంలోని పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించాలని లోకేశ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో… చంద్రబాబు అరెస్ట్, వైసీపీ విధానాలను ప్రస్తావించేలా తెలుగుదేశం పార్టీ వ్యూహాలను సిద్ధం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై ఎంపీలతో కూడా లోకేశ్ చర్చించే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు, స్కిల్ డెలప్ మెంట్ కేసుపై ఢిల్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని కూడా సమాచారం. ఈ టూర్ లో భాగంగా కేంద్రంలోని పెద్దలను కలుస్తారా..? లేదా…? అనేది తెలియాల్సి ఉంది.
తమ అధినేత చంద్రబాబు సింహం లాంటి వ్యక్తి అని, ఆయన దేనికీ భయపడరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. చంద్రబాబు జైలు లోపల ఉన్నా సీఎం జగన్‌కు చెమటలు పట్టిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతో నారా లోకేశ్ మాట్లాడారు. “హైదరాబాద్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. సైబర్ టవర్స్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించారు. చంద్రబాబు ఏ ఒక్క వర్గానికి కూడా ద్రోహం చేయలేదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి అమలు చేశారు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని ఇప్పుడు ఆయనపై కేసు పెట్టారు. చట్టాలను చుట్టాలుగా మారిస్తే సివిల్ వార్ మొదలుపెట్టాలి. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోరాటం చేసే అంశంపై కమిటీ ఏర్పాటు చేస్తాం. జగన్ చేసిన ప్రతి తప్పును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని” చెప్పారు.
"కలిసికట్టుగా పోరాడాలనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిప్రాయం. ఇరు పార్టీల చర్చల తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రజల తరఫున పోరాడుతున్న తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా లోకేశ్‌ను జైలుకు పంపిస్తామని వైసీపీ మంత్రులు చెబుతున్నారు. ప్రజల కోసం పోరాడుతున్నందుకే చంద్రబాబును జైల్లో పెట్టారు. అందుకే కలిసికట్టుగా పోరాడుతామని పవన్ కల్యాణ్ జైలు వద్దే ప్రకటించారు. పవన్ కల్యాణ్ లాంటి నాయకుడిని రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారంటే సామాన్యుడు తిరిగే పరిస్థితి ఉంటుందా?’’ అని లోకేశ్ ప్రశ్నించారు.