Lokesh Yuvagalam: 50వ రోజుకు చేరువలో లోకేష్ యువగళం-tdp leader nara lokesh s yuvagalam padayatra is approaching its 50th day
Telugu News  /  Andhra Pradesh  /  Tdp Leader Nara Lokesh's Yuvagalam Padayatra Is Approaching Its 50th Day
కదిరి యువగళం పాదయాత్రలో నారా లోకేష్
కదిరి యువగళం పాదయాత్రలో నారా లోకేష్

Lokesh Yuvagalam: 50వ రోజుకు చేరువలో లోకేష్ యువగళం

22 March 2023, 7:49 ISTHT Telugu Desk
22 March 2023, 7:49 IST

Lokesh Yuvagalam: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 50వ రోజుకు చేరువవుతోంది. జనవరి 27న చేపట్టిన యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు కదిరి నియోజక వర్గంలో సాగిన లోకేష్ పాదయాత్ర పుట్టపర్తిలోకి ప్రవేశించింది. ఉగాది పండుగ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు.

Lokesh Yuvagalam: టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు రోజుల పాటు దుమ్మురేపింది. పాదయాత్రలో అడుగడుగునా జనం వెల్లువలా తరలివచ్చి సంఘీభావం తెలిపారు. 49వరోజున యువగళం పాదయాత్ర కదిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తయి పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కదిరి ఆర్డీఓ కార్యాలయం వద్ద విడిది కేంద్రం నుంచి 49వరోజు పాదయాత్ర ప్రారంభానికి ముందుకు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో యువతీయువకులు, అభిమానులు పోటీపడ్డారు.

న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న అంగన్‍వాడీ వర్కర్లపై జగన్ సర్కారు దాష్టీకానికి నిరసనగా నల్ల బ్యాడ్జీ ధరించి యువనేత లోకేష్ పాదయాత్ర చేపట్టారు. లోకేష్ తో పాటు పాదయాత్ర నాయకులు, కార్యకర్తలు కూడా నల్లబ్యాడ్జీలు ధరించారు. జీతాల పెంపుపై హామీలు అమలు చేయాలని కోరితే అంగన్ వాడీలను అరెస్టు చేయడం దారుణం, హక్కుల కోసం గళమెత్తి అంగన్వాడీలపై పోలీసులతో అణచివేత అప్రజాస్వామికం, న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేరవేర్చాలని లోకేష్ డిమాండ్ చేశారు.

లోకేష్‌కు సంఘీభావంగా మంగళవారం నాటి పాదయాత్రలో సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొని కొంతదూరం నడిచారు. పాదయాత్ర సందర్భంగా ముత్యాలమ్మ చెరువులో నిలచిపోయిన టిడ్కో గృహాలను పరిశీలించిన యువనేత లబ్ధిదారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కే.బ్రాహ్మణపల్లి వద్ద గజమాలతో యువనేతకు స్థానికులు స్వాగతం పలికారు. సుబ్బరాయుని పల్లి వద్ద గజమాలతో యువనేతకు ఎదురేగి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ముత్యాలమ్మ చెరువు వద్ద భోజన విరామం అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. పులగంపల్లి గ్రామం వద్ద పుట్టపర్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది.

సాయంత్రం పులగంపల్లి వద్ద పుట్టపర్తి నియోజకవర్గంలో ప్రవేశించిన యువనేతకు పుట్టపర్తి ఇన్ చార్జి పల్లె రఘునాథ్ రెడ్డి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు యువనేతకు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా మోతలు, డప్పు శబ్దాలతో హోరెత్తిస్తూ యువనేతపై పూలవర్షం కురిపించారు. అనంతరం గొనుకువారిపల్లి క్రాస్ వద్ద పాదయాత్ర విడిది కేంద్రానికి చేరింది. మంగళవారం నాటి పాదయాత్రలో యువనేత పాదయాత్రకు హిందూపురం నుండి సుమారు 2వేల మంది కార్యకర్తలు వచ్చి సంఘీభావం తెలిపారు. వీరందిరికీ గొనుకువారిపల్లి విడిది కేంద్రం వద్ద యువనేత ప్రత్యేకంగా సెల్ఫీలు ఇచ్చారు.

యువనేతను కలిసిన ఎమ్మెల్సీలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాలు సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు రాం గోపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిలు కదిరిలో లోకేష్ ను కలిశారు. ముగ్గురినీ లోకేష్ శాలువా కప్పి సత్కరించారు. వైసిపి అక్రమాలకు ఎదురొడ్డి పోరాడిన మీరు రియల్ హీరోలని యువనేత ప్రశంసించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గకుండా సైకో పాలన పై మీరు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజా సమస్యలపై మండలిలో ప్రజాగళాన్ని గట్టిగా వినిపించాలని కోరారు.

టిడ్కో ఇళ్లపై మడమ తిప్పాడని విమర్శలు…

కదిరి శివారు ముత్యాలమ్మ చెరువువద్ద టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను యువనేత లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ గోడు విన్పిస్తూ టిడిపి హయాంలో 90 శాతం పూర్తయిన ఇళ్లను వైసిపి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పూర్తి చెయ్యలేదు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. లబ్దిదారుల ఎంపిక లోనూ అన్యాయం చేశారు. టిడిపి హయాంలో ఉన్న లబ్దిదారులను తొలగించి వైసిపి నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తున్నారు. మేము కట్టిన డిడి డబ్బులు కూడా వెనక్కి ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

గెలిచిన వెంటనే ఉచితంగా టిడ్కో ఇళ్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం పూర్తయిన ఇళ్లను పూర్తి చేసి లబ్ది దారులకు ఇవ్వకుండా అనేక నిబంధనలు పెట్టి పేదవారిని వైసిపి ప్రభుత్వం వేధిస్తోందని మండిపడ్డారు. పట్టణ పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో టిడిపి ప్రభుత్వం టిడ్కో నేతృత్వంలో జీప్లస్‌ త్రీ తరహాలో మూడు రకాలు ఇళ్లు నిర్మించిందని గుర్తు చేశారు. 300,365, 430 చదరపు అడుగులతో పూర్తిగా షీర్‌వాల్ -టెక్నాలజీని ఉపయోగించి ఇళ్లను నిర్మించామన్నారు.

సుమారు 1800 మంది గతంలో డబ్బు చెల్లించగా, 1104 మందిని ఎంపిక చేసి మిగిలిన వారికి డబ్బు ఇంకా వాపసు ఇవ్వలేదన్నారు. ఇళ్ళు సగం పూర్తై నాలుగేళ్లుగా అసంపూర్తి గానే ఉన్నాయన్నారు. నిజమైన లబ్దిదారులను తప్పించి వైసిపి నేతలు ఇళ్లు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చెయ్యాలని నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలన్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వకపోగా సెంటు స్థలం పేరుతో వేల కోట్ల ప్రజా ధనాన్ని వైసిపి నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. తక్షణమే మిగిలిన పనులు పూర్తి చేసి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలన్నారు.

సంబంధిత కథనం

టాపిక్