Ganta Meets Chiru : గాడ్‌ ఫాదర్‌తో గంటా భేటీ.. ఆంధ్రా అడ్డాలో సరికొత్త చర్చ!-tdp leader ganta srinivasrao meet megastar chiranjeevi at hyd ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Leader Ganta Srinivasrao Meet Megastar Chiranjeevi At Hyd

Ganta Meets Chiru : గాడ్‌ ఫాదర్‌తో గంటా భేటీ.. ఆంధ్రా అడ్డాలో సరికొత్త చర్చ!

HT Telugu Desk HT Telugu
Oct 08, 2022 07:17 PM IST

మెగాస్టార్ చిరంజీవితో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత చిరు ఇంటికి వెళ్లిన గంటా.. పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

చిరంజీవితో గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫొటో)
చిరంజీవితో గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫొటో) (twitter)

TDP Leader Ganta Meet Megastar Chiranjivi: మెగాస్టార్ చిరంజీవి.... గత కొద్దిరోజులుగా ఆయన పేరు మారుమోగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన... తిరిగి సినీ రంగంలోకి వచ్చేశారు. సినిమాలు కూడా తీశారు. అయితే తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు నేను దూరంగా వున్నా.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఇటీవల ఆయన చేసిన కామెంట్స్... పొలిటికల్ హీట్ పుట్టించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు జారీ చేయటం, పవన్ సీఎం కావాలంటూ వ్యాఖ్యలు చేయటం కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు... చిరుతో భేటీ కావటం ఆంధ్రా అడ్డాలో ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

మెగాస్టార్ చిరంజీవితో మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ హైదరాబాద్ లో భేటీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్బంగా రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే చిరుకు అభినందనలు చెప్పేందుకే కలిశారని గంటా వర్గం చెబుతుంది. అయితే ఈ భేటీలో తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం. అయితే చిరుతో గంటా చాలారోజుల తర్వాత భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది.

గతంలో వంగవీటి రాధా, గంటా వంటి నేతలు సరికొత్త వేదిక నెలకొల్పేలా పావులు కదుపుతున్నారనే వార్తలు వచ్చాయి. కాపు సామాజికవర్గానికి సంబంధించి ఓ వేదికను ఏర్పాటు చేస్తారని కూడా చర్చ నడిచింది. అయితే అది మధ్యలోనే ఆగిపోయింది. ఇక గత ఎన్నికల్లో ఓడిపోయిన గంటా పెద్దగా టీడీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం లేదు. ఆయన వైసీపీలో చేరుతారనే వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. కానీ ఆయన మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఇక పవన్ స్థాపించిన జనసేన గంటా చూస్తున్నారంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటి నేపథ్యంలో గంటా చిరుతో భేటీ కావటం మాత్రం ఆసక్తికరంగా మారిందనే చెప్పొచ్చు.

చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. పరోక్షంగా తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. గంటా కూడా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. కాంగ్రెస్ లో విలీనం తర్వాత రాష్ట్రంలో మంత్రి పదవి కూడా దక్కింది.

ఏపీ పునర్విభజన తర్వాత కొన్ని రోజుల పాటు రాజకీయాల్లో కనిపించిన చిరంజీవి... మళ్లీ సినిమాల వైపు అడుగు వేశారు. అయినప్పటికీ పలుమార్లు చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ వార్తలు వచ్చాయి. కొన్ని నెలల క్రితం సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌ను కలిసిన సమయంలో కూడా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై చర్చ సాగింది. ఆయనకు వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందనే చర్చ నడిచింది. ఇదిలా ఉంటే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఏపీలో అల్లూరి విగ్రహాన్ని విష్కరించారు. మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమానికి చిరంజీవిని కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆయన బీజేపీలో చేరటం ఖాయమనే అన్నారు. అయితే చిరు మాత్రం అలాంటి ఆలోచన లేదంటూ కొట్టిపారేస్తూ వచ్చారు.

మొత్తంగా గంటా శ్రీనివాసరావు చిరంజీవిని కలవటం వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయి...? రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయా..? లేక గాడ్ ఫాదర్ హిట్ అయిన నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిశారా అనేది మాత్రం... రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి తెలిసే అవకాశం ఉంది.

WhatsApp channel