TDP vs YSRCP : వంశీనే కాదు.. వీరిని కూడా అరెస్టు చేస్తాం.. లిస్టు చెప్పిన టీడీపీ సీనియర్ నేత!
TDP vs YSRCP : వల్లభనేని వంశీ అరెస్టుపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయన అరెస్టు బాధాకరం అని వైసీపీ నేతలు అంటున్నారు. వంశీ అరెస్టు సక్రమమే అని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మరో అడుగు ముందుకేసి.. త్వరలోనే మరికొందరి అరెస్టు ఉంటుందని పేర్లతో సహా చెప్పారు.
సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్, హత్యాయత్నం కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. వంశీ రిమాండ్ రిపోర్ట్‌లో 12మందిని చేర్చారు. ఇప్పటికే వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరి కొంతమందిని కేసులో చేర్చే అవకాశం ఉంది. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులు కీలకంగా ఉన్నారు.
14 రోజుల రిమాండ్..
ఈ కేసులో వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వల్లభనేని వంశీతో పాటు నిమ్మా లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో వల్లభనేని వంశీని జిల్లా జైలుకు తరలించారు. అయితే.. వంశీ అరెస్టు వ్యవహారం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా.. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
వీరిని కూడా అరెస్టు చేస్తాం..
'వల్లభనేని వంశీ పాపం పండింది. వంశీ బయట తిరిగితే సమాజానికి హానికరం. వల్లభనేని వంశీది నీచమైన చరిత్ర. వంశీనే కాదు.. కొడాలి నాని, పేర్నినాని.. వెల్లంపల్లి, అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తాం. టీడీపీ డోర్ ఓపెన్ చేస్తే వైసీపీలో ఎవరూ ఉండరు. వైసీపీ మునిగిపోయే నావ' అని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
కర్మ సిద్ధాంతం..
వంశీ అరెస్ట్‌పై హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. 'వంశీ అరెస్ట్‌లో కర్మ సిద్ధాంతం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో మా వాళ్లను అరెస్ట్ చేస్తే సక్రమం.. మా ప్రభుత్వంలో అరెస్ట్‌లు చేస్తే అక్రమమా.. గత ప్రభుత్వంలో మమ్మల్ని.. డీజీపీ ఆఫీసు గేటు దగ్గరకు కూడా రానివ్వలేదు. అన్ని ఆధారాలతోనే వంశీని అరెస్ట్ చేశాం' అని అనిత స్పష్టం చేశారు.
దోషులుగా తేలితేనే..
వంశీ అరెస్టుపై మంత్రి బాలవీరాంజనేయస్వామి కూడా స్పందించారు. 'మేం అక్రమ అరెస్టులు చేయడం లేదు. విచారణలో దోషులుగా తేలితేనే అరెస్టు చేస్తాం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే.. చాలామందిని అరెస్టు చేసేవాళ్లం' అని బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు.
వంశీ అరెస్టు బాధాకరం..
వల్లభనేని వంశీ అరెస్ట్ బాధాకరం అని వైసీపీ నేత విరూపాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో లేదు. లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోంది. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక.. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు' విరూపాక్షి విమర్శించారు.
ప్రత్యేక బృందం ఏర్పాటు..
అటు వల్లభనేని వంశీ కేసులో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. వంశీ మొబైల్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్‌కు రెండు బృందాలు వెళ్లాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేసే అవకాశం ఉంది. వంశీ మొబైల్‌లో కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితుల కోసం మరో బృందం గాలిస్తోంది.