Kurnool Crime : కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో దాడి.. ప్రాణం తీసిన ఆధిపత్య పోరు!-tdp leader brutally murdered in kurnool due to power struggle ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Crime : కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో దాడి.. ప్రాణం తీసిన ఆధిపత్య పోరు!

Kurnool Crime : కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య.. కత్తులతో దాడి.. ప్రాణం తీసిన ఆధిపత్య పోరు!

Kurnool Crime : కర్నూలు జిల్లాలో మళ్లీ హత్యలు ప్రారంభమయ్యాయి. ఆధిపత్య పోరు కారణంగా మరో నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ కార్పొరేటర్ మర్డర్‌తో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. కత్తులతో నరికి చంపడం సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

టీడీపీ నేత దారుణ హత్య (istockphoto)

కర్నూలు నగరంలోని శరీన్‌నగర్‌కు చెందిన మాజీ కార్పొరేటర్ కోశపోగు సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి అదే కాలనీలో.. సంజన్నను దుండగులు కత్తులతో నరికి చంపడం సంచలనంగా మారింది. ఈ హత్య తర్వాత ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో వ్యక్తి వాహనంపై సంజన్న అనుచరులు దాడి చేశారు.

ఏం జరిగింది..

శరీన్‌నగర్‌లో నివాసం ఉండే సంజన్న సీపీఎం తరఫున రాజకీయాల్లోకి వచ్చారు. కార్పొరేటర్‌గా పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి తన కుమారుడు జయరాంను కార్పొరేటర్‌గా గెలిపించుకున్నారు. అయితే.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాటసానితో విభేదించి టీడీపీలో చేరారు. బైరెడ్డి వర్గీయుడిగా కొనసాగుతున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు సమస్య అక్కడే వచ్చింది.

ఆధిపత్య పోరు..

అదే కాలనీలో బైరెడ్డి వర్గీయుడు రౌడీషీటర్‌ వడ్డె రామాంజనేయులు అలియాస్‌ వడ్డె అంజి ఉంటున్నారు. అతనితో సంజన్నకు ఆధిపత్యపోరు ఎక్కువైంది. ఇరువర్గాల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అవి దాడుల వరకూ వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే.. సంజన్న మర్డర్ జరిగింది. శుక్రవారం రాత్రి కాలనీలో గుడికల్‌ అలిపిరా స్వామి మందిరంలో భజన పూర్తి చేసుకుని.. సంజన్న ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడే దుండగులు కత్తులతో దాడి చేసి తలపై బలంగా వేటు వేశారు.

తల ఛిద్రమై..

దుండగుల దాడికి సంజన్న తల ఛిద్రమైంది. అక్కడే కుప్పకూలి పడిపోయారు. గమనించిన స్థానికులు హుటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే సంజన్న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ హత్య గురించి తెలిసి తెలుగుదేశం పార్టీ వర్గీయులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.

అంజీ వాహనంపై దాడి..

ఈ హత్యకు కారణం వడ్డె అంజీ అని భావించిన సంజన్న వర్గీయులు కోపోద్రేకంతో.. అంజీ వాహనంపైన రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో కాలనీలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వడ్డె అంజి, అతని కుమారులు మరికొందరు ఘటనలో పాల్గొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణతో తెలిసింది. దీనిపై కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మళ్లీ ఎలాంటి గొడవలు జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.