Mahanadu Maha Sakthi: మహానాడులో “మహా శక్తి”.. కొత్త పథకానికి టీడీపీ రెడీ-tdp is preparing to announce a new scheme for women in mahanadu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Tdp Is Preparing To Announce A New Scheme For Women In Mahanadu

Mahanadu Maha Sakthi: మహానాడులో “మహా శక్తి”.. కొత్త పథకానికి టీడీపీ రెడీ

HT Telugu Desk HT Telugu
May 25, 2023 05:47 PM IST

Mahanadu Mahila Sakthi: సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో కీలక ప్రకటనలు చేయడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. ప్రజల్ని ఆకర్షించే పలు జనాకర్షక పథకాలను మహానాడు వేదికపై ప్రకటించనున్నారు.

రాజాం రోడ్‌ షోలో చంద్రబాబు నాయుడు
రాజాం రోడ్‌ షోలో చంద్రబాబు నాయుడు

Mahanadu Mahila Sakthi: ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు కీలకం కానున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉందని నమ్ముతోన్న టీడీపీ, అదే సమయంలో ప్రజల్ని తమ వైపు తిప్పుకోడానికి ప్రజాకర్షక పథకాలను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. మహాశక్తి పేరుతో 18ఏళ్లు నిండిన మహిళలకు నేరుగా నగదు బదిలీ చేసే పథకానికి రూపకల్పన చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ నాలుగేళ్లలో రూ.2.5లక్షల కోట్ల రుపాయల విలువైన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను ప్రజలకు అందచేశామని చెబుతోంది. ముఖ్యమంత్రి ఇటీవలి కాలంలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఏకరవు పెడుతున్నారు. ప్రత్యక్ష పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజలకు ఎంత మేలు చేశామో చెబుతున్నారు.

ప్రత్యక్ష పరోక్ష నగదు బదిలీ పథకాల ద్వారా దాదాపు రూ. 3లక్షల కోట్ల రుపాయల విలువైన సంక్షేమాన్ని ప్రజలకు అందచేశామని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించామని, సంక్షేమ పథకాల అమలుకు కులం చూడకుండా, మతం, ప్రాంతం చూడకుండా చివరకు పార్టీ కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేశామని చెబుతున్నారు.

తాను చేసిన మంచిపనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు అందుకుంటే తనకు అండగా నిలవాలని, ప్రజలు ఏ చిన్న పొరపాటు చేసినా ఇప్పుడు అందుకుంటున్న పథకాలన్నీ నిలిచిపోతాయని పదేపదే హెచ్చరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న నగదు బదిలీ పథకాలన్నీ నిలిచిపోతాయని చెబుతున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు ద్వారా ఎన్నికల్లో గెలిస్తే ఏమి చేస్తుందో వివరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. వైసీపీ అమలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు, సంక్షేమ పథకాల ద్వారా దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వర్గాలను ఆకట్టుకోవాలంటే అంతకు మించిన సంక్షేమాన్ని అందించాలని భావిస్తోంది.

ప్రస్తుతం వైసీపీ దాదాపు 63లక్షల మందికి వృద్ధాప్య,వితంతు, వికలాంగ పెన్షన్లను అందచేస్తున్నారు. ఇవి కాకుండా జగనన్న అమ్మఒడి, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, ఆసరా,చేదోడు, ఆరోగ్య ఆసరా పథకాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు లబ్దిదారులుగా ఉంటున్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో అత్యధిక శాతం మహిళలనే లబ్దిదారులుగా గుర్తిస్తున్నారు. అమ్మఒడి, వసతిదీవెన, విద్యాదీవెన వంటి పథకాల్లో కూడా మహిళల ఖాతాల్లోకి ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 23 రకాల పథకాల్లో లబ్దిదారులను మహిళలుగానే పరిగణిస్తున్నారు. వీటిలో రైతులు, మత్స్యకారులు, పెన్షనర్ల వంటి వాటిని మినహాయిస్తే అన్ని రకాల పథకాల్లో దాదాపు 3,58,78,924మందికి ప్రభుత్వం నుంచి ఏదో రూపంలో సాయం అందుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మహిళలకు నేరుగా ఆర్దిక సాయం…

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు భిన్నంగా మహిళా శక్తి పేరుతో మహిళల్ని ఆకట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. “మహా శక్తి” పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించాలని భావిస్తోంది. 18ఏళ్లు నిండి, దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న మహిళలకు నెలనెల నగదు సాయాన్ని అందించే పథకాన్ని మహానాడు వేదికగా ప్రకటించనున్నరు.

టీడీపీ ప్రాథమికంగా ప్రతి నెల మహిళలకు వెయ్యి రుపాయల నగదును అర్హులైన ప్రతి మహిళకు అందిస్తారు.మహా శక్తి పేరుతో వెబ్ సైట్‌, మొబైల్ యాప్ రూపొందించి దానిలో లబ్దిదారులు నేరుగా రిజిస్ట్రర్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు. ప్రస్తుతం వైసీపీ అందిస్తున్న కాపునేస్తం, ఈబీసీ నేస్తం, చేదోడు, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాల్లో ఏటా ఒక్కసారి మాత్రమే నగదు సాయం అందుతోంది. దాని స్థానంలో ప్రతి మహిళకు నెలనెల ఆర్ధికంగా సాయం అందించే కొత్త పథకాన్ని ప్రకటించాలని టీడీపీ భావిస్తోంది.

టీడీపీ అధికారంలోకి వస్తే నగదు బదిలీ పథకాలు నిలిచిపోతాయని వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కొత్త నగదు బదిలీ పథకాన్ని ప్రకటించడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని యోచిస్తోంది.

IPL_Entry_Point