TDP On Deputy CM Issue : లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం-tdp high command responded on nara lokesh deputy cm position warns party leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tdp On Deputy Cm Issue : లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం

TDP On Deputy CM Issue : లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం

Bandaru Satyaprasad HT Telugu
Jan 20, 2025 07:19 PM IST

TDP On Deputy CM Issue : లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న టీడీపీ నేతల డిమాండ్లపై అధిష్ఠానం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది.

 లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం
లోకేశ్ కు డిప్యూటీ సీఎం డిమాండ్లు, స్పందించిన టీడీపీ అధిష్ఠానం

TDP On Deputy CM Issue : మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.

సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పర్యటనలో...కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు పలికారు. లోకేశ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అనంతరం పలువురు నేతలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బహిరంగ ప్రకటన చేస్తుండడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది.

టీడీపీ నేతల డిమాండ్లకు జనసేన నేతలు కౌంటర్ గా స్పందించారు. పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన నేతలు స్వరం పెంచారు. తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్‌ ఈ అంశంపై స్పందించారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నామన్నారు. లోకేశ్ ను డిప్యూటీ పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోరుకోవడంలో తప్పులేదని అన్నారు. అలాగే తాము పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని పదేళ్లుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.

"పవన్ కల్యాణ్ ను సీఎం చూడాలని బడుగు బలహీన వర్గాలు కోరుకుంటున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనగిస్తే మంచిది. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరి పోయకండి. వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వవద్దు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు" - జనసేన నేత కిరణ్ రాయల్

వివాదం ముదురుతుండడంతో టీడీపీ అధిష్టానం కల్పించుకుంది. డిప్యూటీ సీఎం వ్యవహారంపై ఎవరూ బహిరంగ ప్రకటన చేయొద్దని సూచించింది. ఏదైన ఉంటే కూటమి పార్టీలు కూర్చొని మాట్లాడుకుంటాయని పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీపై రుద్దవద్దని కోరింది. టీడీపీ అధిష్ఠానం ప్రకటనతో డిప్యూటీ సీఎం వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం