Chandrababu : జగన్ పాలనలో కేసులతో కోర్టులు కళకళలాడుతున్నాయి.. చంద్రబాబు-tdp chief chandrababu fires on ysrcp govt and cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : జగన్ పాలనలో కేసులతో కోర్టులు కళకళలాడుతున్నాయి.. చంద్రబాబు

Chandrababu : జగన్ పాలనలో కేసులతో కోర్టులు కళకళలాడుతున్నాయి.. చంద్రబాబు

HT Telugu Desk HT Telugu
Mar 04, 2023 08:23 PM IST

Chandrababu : వైఎస్సార్సీపీ సర్కార్.. సీఎం జగన్ పరిపాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన రాజకీయ జీవితంలో చూడలేదన్నారు. అధికార పార్టీ నేతల అరాచకాల నుంచి రక్షణ కోసం ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని... కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు.

టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu : వైఎస్సార్సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారమైందని... టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్ పరిపాలనలో రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని.. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు రూ. 40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించిన చంద్రబాబు... మెడపై కత్తిపెట్టి ఆస్తులు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీసుల ఉన్నతాధికారులని హెచ్చరించిన ఆయన... వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని.. అలాంటి అధికారులని వదిలే ప్రసక్తే లేదని అన్నారు. విజయవాడ సీకే కన్వెన్షన్ హాల్ లో జరిగిన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్రస్థాయి సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ చూడలేదన్నారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అందరూ దివాళా తీశారని... అయితే కోర్టులు మాత్రం కళకళలాడుతున్నాయని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నేతల అరాచకాల నుంచి రక్షణ కోసం ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని... కోర్టుల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. సీఎం జగన్ అరాచకాల నుంచి అధికార పార్టీ నేతల్ని కూడా తామే కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎంపీ రఘురామ రాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ అసమర్థ విధానాలను ఎవరు ప్రశ్నించినా అరెస్టు చేస్తున్నారని... టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతల ఆగడాలను టీడీపీ లీగల్ సెల్ దీటుగా ఎదుర్కుంటోందని అన్నారు.

రాష్ట్రంలో అధికార పార్టీ దౌర్జన్యాలకు సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదన్న చంద్రబాబు... విసిగిపోయిన ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకముందు... చిత్తూరు జిల్లాకు చెందిన బీసీ మహిళ మునిరాజమ్మకు చంద్రబాబు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. లోకేశ్ పాదయాత్రలో ఆమె తన బాధలు చెప్పుకోగా... ఆమె హోటల్ పై శ్రీకాళహస్తిలో కొంత మంది దాడులకి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతలే ఈ దాడులు చేశారని టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే.. చంద్రబాబుని కలిసి మునిరాజమ్మ తన పరిస్థితిని వివరించారు. ఆమెకు ధైర్యం చెప్పిన ఆయన... రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మాట్లాడిన ఆమె... ఈ ప్రభుత్వంలో తనకు జరిగిన అన్యాయాన్ని లోకేశ్ తో చెప్పుకోవడమే తాను చేసిన నేరమా అని ప్రశ్నించారు. తనని అనరాని మాటలు అన్న వైసీపీ ఎమ్మెల్యే మదుసూదన్ రెడ్డి, అతిని తీరుని సమర్థించిన సీఎం జగన్ కి మహిళలు బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.