Chandrababu : చంద్రబాబు అరెస్టును ఖండించిన అఖిలేష్, సుఖ్ బీర్ సింగ్- ప్రతిపక్ష నేతల అరెస్ట్ ట్రెండ్ గా మారిందని ట్వీట్-tdp chief chandrababu arrest akhilesh yadav sukhbir singh badal condemned alleged on bjp ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Tdp Chief Chandrababu Arrest Akhilesh Yadav Sukhbir Singh Badal Condemned Alleged On Bjp Ysrcp

Chandrababu : చంద్రబాబు అరెస్టును ఖండించిన అఖిలేష్, సుఖ్ బీర్ సింగ్- ప్రతిపక్ష నేతల అరెస్ట్ ట్రెండ్ గా మారిందని ట్వీట్

Bandaru Satyaprasad HT Telugu
Sep 12, 2023 10:10 PM IST

Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును జాతీయ స్థాయి నేతలు ఖండిస్తున్నారు. అఖిలేష్ యాదవ్, సుఖ్ బీర్ సింగ్ బాదల్ చంద్రబాబు అరెస్టును తప్పుబట్టారు.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ స్థాయి నాయకులు స్పందిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును బెంగాల సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం ఇప్పుడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రెండ్‌గా మారిందని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టడం నిరంకుశ పాలకుల విధానమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలకు తావు లేదని తెలిపారు. రాజకీయాల్లో ఇలాంటి విషయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ, వారి అవకాశవాద స్నేహితులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. స్వార్థపూరిత బీజేపీ ఎవరికీ రాజకీయ మిత్రుడు కాదని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

బూటకపు ఆరోపణలతో అరెస్టు-శిరోమణి అకాలీదల్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు చేయడం దురదృష్టకరమని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆధునిక ఏపీ రూపశిల్పిగా పేరొందిన చంద్రబాబును బూటకపు ఆరోపణలతో అరెస్టు చేశారన్నారు. ఇటువంటి ప్రతీకార చర్యలు ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ వ్యతిరేకించాలన్నారు.

చంద్రబాబు అరెస్టు విధానం సరికాదు- బండి సంజయ్

చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు చేసిన విధానం సరైంది కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండానే సీఎంగా సుదీర్ఘ కాలం పనిచేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్టు చేయడం సరికాదని తప్పుబట్టారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో టీడీపీకి ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్టు ఆధారాలుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు.

సినీ పరిశ్రమ స్పందించాలి - నట్టికుమార్

చంద్రబాబు అరెస్ట్ పై జూ.ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి స్పందించాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. సినీ పరిశ్రమ కోసం చంద్రబాబు ఎంతో చేశారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఉంటే జగన్ ఉరితీస్తారా? ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఫిల్మ్ ఛాంబర్ లోని నందమూరి అభిమానులు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎన్టీఆర్, చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ మేమున్నామని మద్దతుగా ట్వీట్ చేస్తే చాలని నట్టి కుమార్ అన్నారు. వెనకాల నుంచి సపోర్ట్‌ చేసేవాళ్లు దొంగలు, ముందుండి మద్దతు తెలిపిన హీరో పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ పెద్ద కొడుకులా ముందడుగు వేసి మద్దతు తెలిపారన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తి జైల్లో ఉండకూడదని, ప్రజల్లో ఉండాలన్నారు. దేశంలో ఉన్న కేసుల్లో ఎక్కువగా రాజకీయ నాయకులపైనే ఉన్నాయని నట్టి కుమార్ అన్నారు.

WhatsApp channel