Dharmavaram : అటు టీడీపీ ఇటు వైసీపీ.. మధ్యలో బీజేపీ.. మళ్లీ రణరంగంగా మారిన ధర్మవరం!
Dharmavaram : అనంతపురం జిల్లా ధర్మవరం మళ్లీ రణరంగంగా మారింది. ఓ నాయకుడి కోసం టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. వైసీపీ నేత బీజేపీలో చేరడానికి రెడీ అయ్యారు. దీన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు, మూడు బైక్‌లు ధ్వంసం అయ్యాయి.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకర్గంలో రాజకీయ వేడి తగ్గలేదు. కూటమి పార్టీలు మధ్యే పొసగక గొడవలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఎమ్మెల్యే, మంత్రి సత్య కుమార్ (బీజేపీ), నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌కు పడటం లేదు. దీంతో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి.
సత్యకుమార్ వల్లే..
ధర్మవరం నియోజకవర్గం సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లింది. బీజేపీ తరపున సత్యకుమార్ పోటీ చేశారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పోటీ చేయకుండా.. పొత్తు ధర్మంలో భాగంగా సత్యకుమార్‌కు మద్దతు ఇచ్చారు. అయితే.. సత్య కుమార్ వల్లే పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యే కాలేదని ఆయన అనుచరులు భావిస్తోన్నారు. దీంతో సత్య కుమార్‌కు, బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు పరస్పరం దాడులు చేసుకున్నారు.
బీజేపీలో చేరేందుకు..
తాజాగా వైసీపీ మైనార్టీ నేత జమీర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన గతంలో టీడీపీలో ఉండేవారు. ఆయనకు మరో టీడీపీ నేత మధ్య స్థల వివాదం జరిగింది. దీంతో రెండేళ్ల కిందట టీడీపీ రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆయనంటే, టీడీపీ వాళ్లకు అసలు పడటం లేదు. ఆయనపై టీడీపీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటు ఎన్నికల్లో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో.. జమీర్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాడు.
వ్యతిరేకిస్తున్న శ్రీరామ్..
రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌ను జమీర్ ఆదివారం కలిశారు. మంత్రి సమక్షంలో బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే జమీర్ రాకను ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు బీజేపీలో చేరికపై జమీర్ ధర్మవరంలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. టీడీపీ శ్రేణులు ఈఫ్లెక్సీలను చించివేశారు. ఈ విషయంపై టీడీపీ, జమీర్ అనుచరుల మధ్య గొడవ జరిగింది.
ఫ్లెక్సీల తొలగింపుతో..
ఫ్లెక్సీల తొలగింపుపై తొలుత వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు కార్లతో పాటు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. దీంతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పార్టీ బలోపేతంపై ఫోకస్..
సత్యకుమార్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత.. ధర్మవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి పెట్టారు. ధర్మవరం ప్రాంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)