Tanuku Liquor Sale In Market : సంతలో మద్యం అమ్మకాలు, వీడియోలు వైరల్-మద్యాంధ్రప్రదేశ్ చేశారని ప్రతిపక్షాలు సెటైర్లు-tanuku liquor sales in market videos viral ysrcp roja satires on chandrababu govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tanuku Liquor Sale In Market : సంతలో మద్యం అమ్మకాలు, వీడియోలు వైరల్-మద్యాంధ్రప్రదేశ్ చేశారని ప్రతిపక్షాలు సెటైర్లు

Tanuku Liquor Sale In Market : సంతలో మద్యం అమ్మకాలు, వీడియోలు వైరల్-మద్యాంధ్రప్రదేశ్ చేశారని ప్రతిపక్షాలు సెటైర్లు

Bandaru Satyaprasad HT Telugu
Oct 28, 2024 03:25 PM IST

Tanuku Liquor Sale In Market : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో బెల్టు షాపు నిర్వాహకులు రెచ్చిపోయారు. ఏకంగా సంతలో మద్యం విక్రయాలు మొదలుపెట్టారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

 సంతలో మద్యం అమ్మకాలు, వీడియోలు వైరల్-మద్యాంధ్రప్రదేశ్ చేశారని ప్రతిపక్షాలు సెటైర్లు
సంతలో మద్యం అమ్మకాలు, వీడియోలు వైరల్-మద్యాంధ్రప్రదేశ్ చేశారని ప్రతిపక్షాలు సెటైర్లు

ఏపీలో ప్రైవేట్ మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్ షాపుల్లో విక్రయాలు జోరుగా సాగుతుంటే...పలు గ్రామాల్లో, ప్రాంతాల్లో బెల్టు షాపులు వెలిశాయి. కొందరి మద్దతుతో బెల్టు షాపుల నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. బహిరంగంగానే మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చోటుచేసుకుంది. కూరగాయలు, నిత్యావసరాలు విక్రయించిన మాదిరి... సంతలో లిక్కర్ అమ్మకాలు చేపట్టారు. ఇంత బహిరంగంగా మద్యం అమ్మకాలు చూసి జనం షాకయ్యారు. ప్రజల వద్దకే మద్యం అంటే ఇదేనేమో అంటూ వీడియోలు తీశారు.

సంతలో మద్యం విక్రయాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొట్టడంతో ఎక్సైజ్ పోలీసులు ఇక చేసేదేం లేక చర్యలకు ఉపశ్రమించారు. ఎవరి అండలేకుండా, పోలీసులకు తెలియకుండానే ఇంత బహిరంగంగా మద్యం విక్రయిస్తున్నారా? అని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో మద్యం ఏకంగా వీధులు, సంతల్లోకి వచ్చేసిందని వైసీపీ విమర్శించింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నేరుంగా సంతలో మద్యం అమ్ముతూ ప్రజలను మత్తులో ముంచుతున్నారని వైసీపీ వీడియో పోస్టు చేసింది.

సంతలో మద్యం విక్రయాలు

తణుకులోని ఓ సంతలో చిన్న బెంచ్‌లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని కొందరు దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. స్థానికులు వీడియోలు తీసి నెట్టింట పెట్టడంతో ఎక్సైజ్, పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా విక్రయిస్తున్న వారిని గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, తణుకు పట్టణ ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

ఈ దాడుల్లో తణుకుకు చెందిన షేక్ మున్న, కొప్పిశెట్టి శివశంకర్, కొల్లి సుకన్యను అరెస్ట్ పోలీసులు ప్రకటించారు. నిందితుల వద్ద రూ.7,800 విలువైన 60 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తణుకులోని సంత మార్కెట్‌, పాతవూరు, సజ్జాపురం, కోనాల, దువ్వ ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంతలో మద్యం విక్రయిస్తున్న వారిని ఎక్సైజ్‌ పోలీసుల అరెస్టు చేశారు, అయితే వీరి వెనుక ఎవరున్నారో చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతోనే గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని విమర్శిస్తున్నాయి.

సంతలో మద్యంపై రోజా ఫైర్

తణుకు సంతలో మద్యం విక్రయాలపై మాజీ మంత్రి రోజా స్పందించారు. జగనన్న విద్యాంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తే..చంద్రబాబు రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చేశారని సెటైర్లు వేశారు. ఏపీలో బెల్టుషాపులను ఎలా నిర్వహిస్తున్నారో చూడండని ఓ వీడియో పోస్టు చేశారు. చిన్నపిల్లల్ని.. విద్యార్థులని పెట్టి మద్యం అమ్మిస్తున్నారని మండిపడ్డారు.

"చంద్రబాబుకి ఓటేసిన ఆంధ్రప్రదేశ్ లోనే తణుకులో ఇలా విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులు వెలిశాయి. టీడీపీ నేతలే మద్యం షాపులు, బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. ఇళ్ల మధ్యలో... మహిళలు నడిచేమార్గాల్లో... చిన్నపిల్లల్ని పెట్టి ఇలా మద్యం అమ్ముతున్నారు. ఇదేనా.. మంచి ప్రభుత్వం? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి... ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి..పిల్లలని పెట్టి మద్యం అమ్మించడం భావ్యమేనా?" -మాజీ మంత్రి రోజా

Whats_app_banner