Talliki Vandanam: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర విద్యావ్యవస్థపై దృష్టి సారించకపోవడం, తప్పుడు విధానాలతో రాష్ట్రంలోని 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల ప్రకటించారు.
పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ఏ కారణం చేతనూ ఏ బిడ్డా విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నామని పయ్యావుల చెప్పారు. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో, మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా 'తల్లికి వందనం' పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు.
2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం క్రింద 15,000 రూపాయల ఆర్థిక సహాయంను అందించనున్నట్టు తెలిపారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుందని చెప్పారు.
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాంలు.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నట్టు తెలిపారు.
ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంతో కూడిన విద్యా వ్యవస్థ కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించినట్టు చెప్పారు. స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమేగాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయల కేటాయించారు.
భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం మరియు అందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం బలమైన, సమ్మిళిత ఉన్నత విద్యావ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని ఈ కార్యక్రమం క్రింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వ విద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణముగా తయారు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాలలో మన రాష్ట్ర విశ్వ విద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించారు.
సంబంధిత కథనం