JC Prabhakar Reddy : సినీ నటి మాధవీ లతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు, పార్టీ మారాలన్న బీజేపీ నేతలకు చురకలు
JC Prabhakar Reddy : సినీ నటి మాధవీ లతపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా జేసీ స్పందించారు. వయసురీత్యా ఆవేశంలో అలా మాట్లాడేశానని, అందుకు క్షమాపణలు కోరారు. తనను పార్టీ మారాలని సూచించిన వారికి కౌంటర్ ఇచ్చారు.
JC Prabhakar Reddy : బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత గురించి ఆవేశంలో, వయసు ప్రభావంతో అలా మాట్లాడానని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాధవీలతకు క్షమాపణలు చెప్పారు. వయసు ప్రభావం ఆవేశంలో తప్పుగా మాట్లాడానన్నారు. నాయకులు అంటే ప్రజల్లో తిరిగితేనే గుర్తింపు వస్తుందని, ఫ్లెక్సీలతో కాదన్నారు. జగన్ పార్టీలో చేరాలని విమర్శలు చేసిన బీజేపీ నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొందరు తనను పార్టీ మారండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని, కేవలం చంద్రబాబు కోసం మాత్రమే టీడీపీ ఉన్నానన్నారు. తానేంటో తాడిపత్రి ప్రజలకు బాగా తెలుసు.. అందరికీ తెలియాల్సి అవసరం లేదన్నారు.
డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్క్ లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలపై మాధవీలతతోపాటు, బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో జేసీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణ కోరుతున్నట్టు జేసీ తెలిపారు. ఆదివారం తాడిపత్రిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప.. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. కొంతమంది తనను మార్టీ మారాలని అంటున్నారని, అలా చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. డిసెంబరు 31న తనను నమ్మి 16 వేల మంది అక్కచెల్లెళ్లు జేసీ పార్క్‌కు వచ్చారన్నారు. తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులంతా ఫ్లెక్సీ గాళ్లే అన్నారు. తాడిపత్రి బాగు కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. రెండు సంవత్సరాల్లో తాడిపత్రి రూపురేఖలు మారుస్తానన్నారు.
అసలేం జరిగింది?
తాడిపత్రిలోని మహిళల కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి...జేసీ పార్క్‌లో న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలకు మాత్రమే అనుమతి అని చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి మహిళలు వెళ్లొద్దంటూ సినీ నటి, బీజేపీ నేత మాధవీ లత ఓ వీడియో విడుదల చేశారు. జేసీ పార్క్ లో గంజాయి బ్యాచ్‌లు ఉంటాయని, దాడులు చేస్తే ఎవరిది బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తాడిపత్రి ప్రజలను గంజాయి బ్యాచ్‌తో పోలుస్తారా? అంటూ మాధవీ లతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాధవీ లతను ప్రొస్టి** అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను బీజేపీలో ఎందుకు చేర్చుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జేసీ బస్సులు దగ్దం వెనుక బీజేపీ నేతల కుట్ర ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వమే నయం అన్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, నటి మాధవి లత కౌంటర్లు ఇచ్చారు. జేసీ తీరును తప్పుబడుతూ...కావాలంటే జగన్ పార్టీలో చేరవచ్చు అన్నారు. ఆయన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ వివాదంపై తాజాగా స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి... తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పారు. అయితే జేసీ క్షమాపణలతో ఈ వివాదం ముగుస్తుందో? లేదో చూడాలి.
సంబంధిత కథనం