MLA Undavalli Sridevi: నేను ఓటేసిన టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా? వైసీపీపై ఎమ్మెల్యే శ్రీదేవి ధ్వజం
Tadikonda MLA Undavalli Sridevi: వైసీపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు విషప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ సవాల్ విసిరారు.
Tadikonda MLA Undavalli Sridevi Comments: వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాడికొండలోని పార్టీ ఆఫీస్ పై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. అసలు తాను చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. రాజధాని ఏరియాలో తనను అడ్డంపెట్టుకొని కొందరు వైసీపీ నేతలు అక్రమంగా ఇసుక దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటికి తాను అడ్డంకిగా మారినందుకే తప్పించారని కామెంట్స్ చేశారు.
"నేను ఓటేసిన టేబుల్ కింద ఎవరైనా కూర్చున్నారా..? నేను మాత్రమే క్రాస్ ఓటింగ్ చేశానని తేల్చారు.జనసేనతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాజధాని పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్న నన్ను తప్పించాలని కుట్ర చేశారు. అందరిచేత తిట్టించేలా ప్లాన్ చేశారు. దొంగ అనేలా నాపై ముద్ర వేశారు. నన్ను పిలిచి మాట్లాడితే పక్కకు జరిగేదాన్ని కాదా...? ఆంధ్రప్రదేశ్ లో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందా లేదా అనేది అర్థం కావటంలేదు. అమరావతి ఇక్కడే ఉంటుందంటూ ఎన్నికల ప్రచారంలో ప్రతి ఒక్కరికి చెప్పాను. ఈ విషయంలో నేను మాట ఇచ్చాను. అందరు నమ్మి నాకు ఓటేశారు. ఇవాళ ఆ దారి నుంచి వెళ్తుంటే... అమరావతి రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వారిని చూసి ప్రతిరోజు బాధపడేదాన్ని. అమరావతిలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది. ఎస్సీలపై తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. ఇవాళ ఓ ఎమ్మెల్యేగా నేనే భయపడుతున్నాను. సామాన్యులు అసలు ఆంధ్రప్రదేశ్ లో తిరిగే పరిస్థితి లేదు" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు శ్రీదేవి.
ఇక నుంచి అమరావతి రైతులతోనే ఉంటానని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. ప్రాణం పోయినా సరే అమరావతి రైతులకు మద్దతు ఉంటుందన్నారు. అమరావతి రాజధాని ఉద్దండయ్యపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది. దానికి నేను అడ్డం వస్తున్నాను అని ఈ విధంగా నన్ను పార్టీ నుంచి తప్పించారు. రాజధానిగా అమరావతే ముద్దు అని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేసి డబ్బులు తీసుకుంటున్న వారికి శ్రీదేవి సవాల్ విసిరారు. ఏ దేవుడి వద్ద అయినా… ప్రమాణం చేయటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. తనకు ఏదైనా జరిగితే ప్రభుత్వ సలహాదారు సజ్జలదే బాధ్యత అని తేల్చి చెప్పారు. తన భద్రతపై పూర్తి నమ్మకం కలిగితేనే ఆంధ్రప్రదేశ్ కు వస్తానని చెప్పుకొచ్చారు.
"నా కళ్లు తెరిపించిన అమరావతి రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎమ్మెల్యేగా నేను అండగా ఉంటాను. మీ పక్కనే కూర్చుంటాను. ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరికి మద్దతుగా ఉంటాను. అమరావతిని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేకు రక్షణకు లేని పరిస్థితి ఏపీలో ఉంది. దిశా యాప్స్ ఎక్కడ పోయాయ్...? వైసీపీ గుండాలతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారు. త్వరలోనే మంచి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇస్తాను. జగన్ గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది. పార్టీ కోసం ఎంతో పని చేశాను. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదు. ప్రస్తుతం స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నా. మరోసారి మీడియా ముందుకు వస్తాను" అని శ్రీదేవి స్పష్టం చేశారు.
సంబంధిత కథనం