Jagan House Road : ప్రజాధనంతో రోడ్లు, క్యాంప్ ఆఫీసు ఫర్నీచర్-తాడేపల్లి జగన్ నివాసంపై వివాదం!
Jagan House Road : మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం రహదారి, క్యాంప్ ఆఫీసులోని ఫర్నిచర్ పై వివాదం నెలకొంది. ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన రహదారిని సొంత ఎస్టేట్ రోడ్డులా మార్చారని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కోట్ల ప్రజాధనంతో తన క్యాంప్ కార్యాలయంలో ఫర్నిచర్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.

Jagan House Road : మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం రహదారి విషయం వివాదాస్పదం అవుతుంది. ప్రభుత్వ రహదారిని ప్రైవేట్ మార్గం మార్చుకుని ఎవరినీ అనుమతించకపోవడంపై ప్రభుత్వం దర్యాప్తు చేసే యోచనలో ఉందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద డబుల్ లేన్ రహదారిని నిర్మించారు. జగన్ ఇంటి వరకు ప్రభుత్వ నిధులతో డబుల్ లేన్ రోడ్డును నిర్మించారు. అయితే ఈ రోడ్డును జగన్ తన సొంత ఎస్టేట్ లోని రోడ్ లాగా భావిస్తున్నారని, ఇతరులు ఎవ్వరికీ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ నివాసం ఉన్నవారి ఇళ్లను తొలగించి వారికి ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం ఇప్పించి రోడ్డు వేశారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యయంతో క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్
జగన్ క్యాంప్ ఆఫీసు పరిధిలోని 1.5 కి.మీ రోడ్డుకు రూ.5 కోట్లు వ్యయం చేశారని, ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు మంజూరైన నిధులతో రోడ్డు నిర్మాణం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. జగన్ సీఎం హోదాలో తన క్యాంప్ ఆఫీసు కోసం కోట్లాది రూపాయల ఖర్చు పెట్టారని, ప్రభుత్వ వ్యయంతో కొన్న ఫర్నిచర్ వినియోగిస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. జగన్ సీఎం హోదాలో క్యాంపు ఆఫీస్ కోసం చేసిన ఖర్చుపై అధికారులు లెక్కలు బయటకు తీస్తున్నారు. ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడపై ఇనుప పెన్సింగ్ కోసం పెట్టిన కోట్లు రూపాయల ఖర్చు, సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు రూ.3.63 కోట్లు ఖర్చుపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారని తేలితే మాజీ సీఎం జగన్ కు నోటీసులిచ్చి, కేసు నమోదు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
నిధుల విడుదల జీవోలపై అధికారులు ఆరా
ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంగా మార్చారు. వైసీపీ నేతలతో సమావేశాలు, భేటీలు ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఇతర సామగ్రిని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకుండా... వైసీపీ కార్యాలయంలోనే వినియోగించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. క్యాంప్ కార్యాలయం రహదారులు, సామాగ్రికి మంజూరు చేసిన నిధుల జీవోలు, ఏయే సామాగ్రి కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆ విషయాలు బయటకు వస్తాయని తెలుస్తోంది.
తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు రూ.16 కోట్లు!
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత... మొదటి ఐదు నెలల్లో జగన్ ప్రభుత్వం...తాడేపల్లిలోని ఆయన ఇంట్లో ప్రత్యేక ఏర్పాట్లకు దాదాపు రూ.16 కోట్లు ఖర్చు చేసిందని తెలుస్తోంది. జగన్ ఇంటికి కొత్త రోడ్డుకు రూ.5 కోట్లు, భద్రతా ఏర్పాట్లకు మరో 1.8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బందికి రూ.80 లక్షలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాల కోసం రూ.3.6 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రజాదర్బార్ ఏర్పాటుకు మరో రూ.82 లక్షలు, ఇతర ఏర్పాట్లకు రూ.22 లక్షలు ఖర్చు పెట్టారు. మాజీ సీఎం ఇంట్లో అల్యూమినియం తలుపులు, కిటికీలకు రూ.73 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగా వ్యూ కట్టర్‌కు రూ.3.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం