CM Jagan : నాలుగున్నర ఏళ్లలో 130 ప్రాజెక్టులు, రూ.69 వేల కోట్ల పెట్టుబడులు- సీఎం జగన్
CM Jagan : వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో 130 ప్రాజెక్టులు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
CM Jagan : ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెడుతోందని సీఎం జగన్ అన్నారు. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. 6 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా చర్యలు చేపట్టామన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి వర్చువల్ గా ఇండస్ట్రీస్, పుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో రూ.1,100 కోట్ల విలువైన పెట్టుబడులతో పలు పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు సీఎం జగన్. ఈ పెట్టుబడుల వల్ల దాదాపు 21 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 9 ప్రాజెక్టుల్లో 3 పరిశ్రమల ప్రారంభం, మరో 6 ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
నాలుగున్నర ఏళ్లలో 130 ప్రాజెక్టులు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 386 ఎంవోయూలు చేసుకున్నామన్నారు. రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఒప్పందాలను పెట్టుబడులుగా మార్చేందుక ప్రతినెలా సమీక్ష చేస్తూ చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 33 యూనిట్లు ఏర్పాటయ్యాయని, ఉత్పత్తులు ప్రారంభించాయన్నారు. 94 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. సీఎస్ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూత అందిస్తున్నామన్నారు. నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లలో 130 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దీంతో 86 వేలమందికి ఉపాధి లభించిందని సీఎం జగన్ తెలిపారు.
9 ప్రాజెక్టులకు శ్రీకారం
పరిశ్రమల ఏర్పాటుకు ఫోన్ కాల్ దూరంలో ఉన్నామని సీఎం జగన్ తెలిపారు. కొత్తగా 1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటయ్యాయని, 12.62 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఇవాళ 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నామని, మిగతా ఆరు ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయన్నారు. వీటితో దాదాపు రూ.1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వస్తాయని హార్షం వ్యక్తం చేశారు. పత్తికొండలో పరిశ్రమ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చామని, ఇవాళ అక్కడ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. అధికారులు సమిష్టి కృషి ఫలితంగానే ఇదంతా జరిగిందన్నారు.