AP Weather Updates: రాయలసీమలో ఎండలు, కోస్తా జిల్లాల్లో చిరుజల్లులు..-sweltering temperatures in rayalaseema light showers in coastal districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Sweltering Temperatures In Rayalaseema, Light Showers In Coastal Districts

AP Weather Updates: రాయలసీమలో ఎండలు, కోస్తా జిల్లాల్లో చిరుజల్లులు..

HT Telugu Desk HT Telugu
May 29, 2023 11:23 AM IST

AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. మరోవైపు కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహ‍ణ సంస్థ ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

AP Weather Updates: ఏపీలోని వైయస్సార్ జిల్లాలోని చాపాడు, కమలాపురం, ప్రొద్దుటూరు, వల్లూరు, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహ‍ణ సంస్థ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో ఎండ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

ఆదివారం ప్రకాశం జిల్లా కురిచేడులో 45.5°C, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 45.2°C, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 44.8°C, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో 44.7°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి. 24 మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్రంలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పిడుగుపాటు, వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో సోమవారం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. రోహిణి కార్తె కావడంతో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వివరించారు.

ప్రస్తుతం తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, ఉత్తర తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా వెళుతోంది.

వీటి ఫలితంగా సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకటి, రెండుచోట్ల, బుధ, గురువారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

పిడుగుపాటుకు ఇద్దరి మృతి…

అనంతపురం జిల్లా శింగనమల మండలం ఉల్లి కల్లు గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి ఇద్దరు మృతిచెందారు. ఉల్లికల్లుకు చెందిన వడ్డే బాలకృష్ణ (35), గౌరీశంకర్‌(19), వారి బంధువు తరుణ్‌కుమార్‌ కలిసి పొలం నుంచి బైక్‌పై ఇంటికి వస్తుండగా, పెద్ద వర్షం కురవడంతో మార్గమధ్యంలోని ఓ చెట్టు కింద ఆగారు. ఆ చెట్టుపై పిడుగుపడటంతో బాలకృష్ణ, గౌరీశంకర్‌ అక్కడికక్కడే మృతిచెందారు.

తరుణ్‌కుమార్‌ ప్రా ణాలతో బయటపడ్డాడు. బాలకృష్ణకు భార్య, కుమార్తె ఉన్నారు. గౌరీశంకర్‌కు వివాహం కాలేదు. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్ద అగ్రహారంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఇద్దరు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

IPL_Entry_Point