Nandyal Crime : ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం.. ఎన్నో అనుమానాలు.. బయట గడియపెట్టింది ఎవరు?-suspicion over burning of inter students in nandyal district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal Crime : ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం.. ఎన్నో అనుమానాలు.. బయట గడియపెట్టింది ఎవరు?

Nandyal Crime : ఇంటర్ విద్యార్థిని సజీవ దహనం.. ఎన్నో అనుమానాలు.. బయట గడియపెట్టింది ఎవరు?

Basani Shiva Kumar HT Telugu
Dec 10, 2024 02:05 PM IST

Nandyal Crime : నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఇంటర్‌ విద్యార్థిని సజీవ దహనం ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ గదిలో ఉన్న యువకుడు ఎవరు.. గది బయట గడియపెట్టింది ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన స్థలంలో రోదిస్తున్న బాలిక బంధువులు
ఘటన స్థలంలో రోదిస్తున్న బాలిక బంధువులు

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన ఇంజమూరి రామకృష్ణ, లక్ష్మి దంపతుల కుమార్తె లహరి. ఆమె చిన్నప్పుడే తండ్రి రామకృష్ణ చనిపోయాడు. తల్లి లక్ష్మి లహరిని పెంచుతోంది. అయితే.. రామళ్లకోటలో ఇంటర్ చదివే అవకాశం లేకపోవడంతో.. నందికొట్కూరులోని లక్ష్మి తల్లిదండ్రుల ఇంట్లో ఉంచి లహరిని చదివిస్తున్నారు.

yearly horoscope entry point

ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. అసలు విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. లహరికి వెల్దుర్తి మండలం కలుగొట్ల గ్రామానికి చెందిన రాఘవేంద్ర అనే యువకుడితో పరిచయం ఉంది. రాఘవేంద్ర టెన్త్ వరకు చదివి మానేశాడు. అతను ఇటీవల లహరి కోసం నందికొట్కూరు వచ్చాడు. లహరితో చాలాసేపు మాట్లాడాడు. ఈ విషయం తెలిసిన బాలిక తాతయ్య.. ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చారు.

ఆ గదిలోకి ఎందుకు వెళ్లింది..

మాధవయ్య ఇంటిని ఆనుకొని ఓ చిన్న గది ఉంది. లహరి అప్పుడప్పుడు ఆ గదిలో కూర్చొని చదువుకునేది. సోమవారం కూడా చదువుకుంటానని ఆ గదిలోకి వెళ్లింది. లహరి అమ్మమ్మ, తాతయ్యలు నిద్రపోయారు. అయితే.. కాసేపటి తర్వాత ఏదో శబ్దం రావడంతో అమ్మమ్మ, తాతయ్య బయటకు వచ్చారు. అప్పుడు ఆ గది నుంచి పొగలు వచ్చాయి.

గది లోపలి నుంచి తలుపులు కొడుతున్న శబ్దాలు వినిపించాయి. వారు బయటి నుంచి తలుపులు తీశారు. అప్పుడు రాఘవేంద్ర అనే యువకుడు కాలిన గాయాలతో బయటకొచ్చాడు. కింద పడిపోయాడు. అప్పటికే లహరి శరీరం కాలిపోయి మృతిచెందింది. ఇటు రాఘవేంద్రను నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. ఆ తర్వాత కర్నూలు జీజీహెచ్‌కు తరలించారు. అతని శరీరం 80 శాతం కాలిపోయిందని, మాట్లాడే స్థితిలో లేడని డాక్టర్లు చెప్పారు.

రాఘవేంద్ర హత్య చేశాడని ప్రచారం..

లహరిని రాఘవేంద్ర హత్య చేశాడని మొదట ప్రచారం జరిగింది. అయితే.. ఆ యువకుడికి చంపే ఉద్దేశం ఉంటే.. లహరికి నిప్పంటించిన తర్వాత పారిపోయేవాడని.. కానీ మంటల్లో అతను కూడా గాయపడ్డాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఇద్దరు గది లోపల ఉన్నప్పుడే బయటి నుంచి గడియ పెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని.. ఈ ఘటనలో వేరేవారి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అర్ధరాత్రి లహరికి ఫోన్..

ఆదివారం అర్ధరాత్రి లహరికి రాఘవేంద్ర ఫోన్‌ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించాయని సమాచారం. అయితే.. గదిలో వారి మధ్య గొడవ జరిగినట్టు, పెనుగులాట జరిగినట్టు కన్పించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు చేసుకోవాలని ప్రయత్నించారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ఒకవేళ సూసైడ్ చేసుకోవాలని వారు భావించినా.. లోపల గడియపెట్టుకోవాలి. కానీ.. ఇక్కడ బయటనుంచి పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూస్‌టీం, వైద్య బృందాలతో పోలీసులు ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

Whats_app_banner