తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం - హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ‘స్టే’-supreme court stays ap hc order faulting cbi chief over tirupati laddu probe ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం - హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ‘స్టే’

తిరుమల లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం - హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు ‘స్టే’

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చిన్నప్పన్న దాఖలు చేసిన కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

తిరుపతి లడ్డూ కేసు - సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు (ANI/File)

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం కల్తీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవలే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరపగా… కీలక వ్యాఖ్యలు చేసింది.

చిన్నప్పన్నకు సిట్ లో లేని అధికారి నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించడమేనని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు…ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు… దర్యాప్తును బలహీనపరచడమే కాకుండా, సిట్ పనితీరుపై అనవసరమైన ఆరోపణలను కలిగించాయని వాదించారు. సీబీఐ డైరెక్టర్ SIT సమావేశం నిర్వహించి, పరిస్థితిని సమీక్షించి, ఆ అధికారి (జె. వెంకట్ రావు)ను రికార్డు కీపర్‌గా కొనసాగనివ్వడం జరిగిందని వివరించారు. సిట్ మొత్తంగా సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలోనే ఉందని చెప్పారు.

ఇందుకు సీజేఐ ధర్మాసనం స్పందిస్తూ… సిట్ తమ పరిధిలో ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌ను నియమిస్తే దాంట్లో తప్పేం ఉంది…? అని వ్యాఖ్యానించారు. దర్యాప్తు పర్యవేక్షణ సీబీఐ డైరెక్టర్ చేతిలోనే ఉంది కదా అన్నారు.

ఇక ఈ కేసులోని చిన్నప్పన్న తరఫు న్యాయవాది వాదిస్తూ… వెంకట్ రావు దర్యాప్తు అధికారి పాత్ర పోషిస్తున్నారని వాదించారు. తన క్లయింట్‌ను ఒత్తిడి చేస్తున్నారని ప్రస్తావించారు. ఇందుకు ధర్మాసనం స్పందిస్తూ… ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం… హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.

హైకోర్టు ఏం చెప్పిందంటే..?

సిట్ పరిధిలోని వెంకట్ రావ్ అనే అధికారి తనకు నోటీసులు ఇచ్చారని చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. తిరుపతిలోని సిట్ కార్యాలయానికి పిలిపించి…. బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేశారని ఆరోపించారు. ఈ పిటిషన్ పై విచారించిన ఏపీ హైకోర్టు… జూలై 10వ తేదీన తీర్పును వెలువరించింది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి ఆ అధికారికి చట్టబద్ధమైన అధికారం లేదని న్యాయస్థానం తేల్చింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సిట్ లో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ (FSSAI) అధికారి ఉండాలని హైకోర్టు గుర్తు చేసింది. కానీ…. సీబీఐ డైరెక్టర్‌ ఆదేశాలతో జె వెంకటరావు అనే అధికారి విచారణలో కీలక పాత్ర పోషించారని అభిప్రాయపడింది. సీబీఐ డైరెక్టర్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని వ్యాఖ్యానించింది.

ఈ తీర్పుపై సీబీఐ… సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలని చిన్నప్పన్నకు నోటీసులు కూడా ఇచ్చింది. తదుపరి విచారణ వరకు సిట్ దర్యాప్తు యథావిధిగా కొనసాగవచ్చని ఆదేశించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం