ఏపీ మద్యం కొనుగోళ్ల కేసులో సుప్రీం కోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ-supreme court rejects anticipatory bail petitions of dhananjaya reddy and krishnamohan reddy in ap liquor purchase case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీ మద్యం కొనుగోళ్ల కేసులో సుప్రీం కోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ

ఏపీ మద్యం కొనుగోళ్ల కేసులో సుప్రీం కోర్టులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ

Sarath Chandra.B HT Telugu

వైసీపీ హయంలో లిక్కర్‌ కొనుగోళ్లు, డిస్టిలరీలకు ఆర్డర్లలో అక్రమాల వ్యవహారంలో మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ దశలో బెయిల్ మంజూరు చేయలేమని ప్రకటించింది.

లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ

వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌‌లో మద్యం విక్రయాల్లో అక్రమాలపై సిట్‌ దర్యాప్తులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిల బెయిల్‌ పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేసు విచారణలో బెయిల్ మంజూరు చేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో తాము జోక్యం చేసుకోవడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.

నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని నిందితుల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఆందోళన వ్యక్తం చేయడంతో వారిపై ఒత్తిడి చేయొద్దని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. రాష్ట్ర ఖజానాపై ప్రభావం చూపే అంశం కావడంతో ఈ దశలో నిందితులకు ఉపశమనం కలిగించేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో మాజీ ముఖ‌్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలపై సిట్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.

మద్యం కేసులో గురువారం సిట్‌ విచారణకు హాజరైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్‌ రెడ్డిలను ఏకబిగిన 12 గంటల పాటు దర్యాప్తు అధికారులు విచారించారు. ఈ కేసులో భారతి సిమెంట్స్‌ కంపెనీ డైరెక్టర్, ఆడిటర్ బాలాజీ గోవిందప్పను ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఏ క్షణాన ఏమి జరుగుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఏపీలో వైసీపీ హయంలో జరిగిన మద్యం విక్రయాలు, డిస్టలరీల నుంచి కొనుగోళ్లు, మద్యం బ్రాండ్ల ఎంపికల్లో అంతిమంగా ఎవరికి లబ్ది చేకూరిందనే దానిపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రమేయంతోనే ఈ అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యం కొనుగోళ్లలో ఐదేళ్లలో రూ.3వేల కోట్లకు పైగా ముడుపులు తరలించారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ముడుపులు మొత్తం ఎక్కడకు చేరాయనే దానిపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

విచారణ తీరుపై వైసీపీ అభ్యంతరం…

లిక్కర్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ తీరు దారుణంగా ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. చట్టాన్ని, నియమాల్ని, నిబంధనలను పట్టించుకోవడం లేదని వైసీపీ లీగల్ సెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

దర్యాప్తు కోణంలో కాకుండా ఎలా వేధించాలన్న కోణంలో సిట్‌ వ్యవహరిస్తోందని, మాజీ ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల వ్యవహారంలో సిట్‌ కక్షపూరిత ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు.

గురువారం ఉదయం 10 గంటలకు సిట్‌ విచారణకు హాజరైతే గురువారం అర్థరాత్రి వరకు విచారణ కొనసాగించారని, పన్నెండున్నర గంటల పాటు విచారణ చేయడాన్ని తప్పు పట్టారు. సిట్‌ విచారణ జరుగుతున్న తీరు పూర్తిగా నిబందనలకు విరుద్ధమని, ఇద్దరు మాజీ అధికారులు సీనియర్‌ సిటిజన్స్ అన్న విషయాన్నికూడా సిట్‌ మరిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిట్‌కు చట్టమన్నా, న్యాయస్థానాలన్నా, రాజ్యాంగమన్నా, సుప్రీం కోర్టు తీర్పులన్నా ఎలాంటి గౌరవం లేదని, పదేపదే కోర్టులు హెచ్చరిస్తున్నా వీళ్ల తీరు మారలేదని, వ్యక్తుల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని, లిక్కర్‌ వ్యవహారంలోనే ఒక నిందితుడి పట్ల సిట్‌ ఇలానే వ్యవహరిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టిందని ఆరోపించారు.

సీనియర్‌ సిటిజన్స్‌ వ్యవహారంలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పినా వాటిని అమలు చేయడం లేదని, ఏదో జరిగిపోయిందన్న భావనను ప్రజలకు కల్పించడానికి ఇలాంటి ఎత్తుగడలకు దిగుతోందని, సిట్‌ అధికారుల వ్యవహార తీరును కోర్టుకు తెలియజేస్తామని వైసీపీ చెబుతోంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం