రాజంపేట ఎంపీ, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు.. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరారు. దీంతో సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలకు సంబంధించిన కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఏపీ సీఐడీ అరెస్టు చేయబోతోందని వార్తలు వచ్చాయి. ఈ కేసులో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని సీఐడీ అనుమానిస్తోంది. మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు.
అయితే.. మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, తదుపరి విచారణ జరిగే వరకు ఆయన్ను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భాగంగా.. తదుపరి విచారణ వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. అలాగే, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నంబర్-2గా చలామణీ అయ్యారనే విమర్శలున్నాయి. వైసీపీ హయాంలో నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌ను తన గుప్పిట్లో పెట్టుకుని.. మద్యం ఉత్పత్తి చేసినట్లు, అక్కడ తయారు చేసిన మద్యానికే అత్యధికంగా సరఫరా ఆర్డర్లు వచ్చేలా చేసినట్టు మిథున్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ దర్యాప్తులోనూ ఇదే విషయం తేలినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి.
వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో.. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోస్, అదాన్ డిస్టిలరీస్ తోపాటు జేఆర్ అసోసియేట్స్, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్, ఎంఎస్ బయోటెక్, శర్వాణి ఆల్కో బ్రూవరీస్ వంటివి ప్రధానమైనవిగా సీఐడీ అధికారులు గుర్తించారు. వాటి వెనక ఎవరున్నారు? వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు లభించడానికి కారణం ఏంటి? అనేదానిపై సీఐడీ ఆరా తీస్తోంది.
సంబంధిత కథనం