SC on Amaravati : అమరావతి కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ.. ఎంత మందికంటే.. ?-supreme court issues notices on amaravati capital issue next hearing to be held on january 31 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Supreme Court Issues Notices On Amaravati Capital Issue Next Hearing To Be Held On January 31

SC on Amaravati : అమరావతి కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ.. ఎంత మందికంటే.. ?

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 03:03 PM IST

SC on Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులో వాద, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన పటిషన్లకు కూడా విచారణకు స్వీకరిస్తున్నామన్న న్యాయస్థానం.. అందరికీ నోటీసులు పంపింది. జనవరి 31లోపు అందరూ అఫిడవిట్లు దాఖలు చేయాలని.. అదే రోజు అన్ని అంశాలపై విచారణ చేస్తామని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

SC on Amaravati : రాజధాని అమరావతి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి.. వాద, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై తమ సమాధానాన్ని జనవరి 31లోపు అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని ఆదేశించింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 28న పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలో... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీం ధర్మాసనం. అయితే.. ఇదే విషయంలో.. అమరావతి రైతులు, మరికొంత మంది ప్రైవేటు వ్యక్తులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా మొత్తం 10 పిటిషన్లు రాగా... వాటిని విచారణకు స్వీకరిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఇదే అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా... సుప్రీంకోర్టు రిజిస్ట్రీ... వాద, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో కొనసాగుతోన్న కేసులో వాద, ప్రతివాదులు సుమారు 260 మంది ఉన్నారని సమాచారం. తాజాగా సుప్రీకోర్టు జారీ చేసిన నోటీసులు అందుకున్న వారిలో ఏపీలోని పలు రాజకీయ పార్టీల అధ్యక్షులు, అధికారులు, శాసనసభ స్పీకర్, శాసనసమండలి ఛైర్మన్, పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు ఉన్నారు. వీరందరూ... జనవరి 31 లోపు రాజధాని అంశంపై తమ సమాధానాలు తెలియజేస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు... తదుపరి విచారణను.. జనవరి 31కి వాయిదా వేసింది.

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో నిర్మించి, అభివృద్ధి చేయాలని ఆదేశిస్తూ.. ఏపీ హైకోర్టు గతేడాది మార్చిలో తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని పలు అంశాలపై స్టే విధించింది. రాజధాని ఫలానా ప్రాంతంలోనే ఉండాలని ఆదేశించే అధికారం న్యాయస్థానానికి లేదని.. అది ప్రభుత్వ పరిధిలోని అంశమని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాల్లో కూడా కోర్టులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదంది. జనవరి 31న అన్ని అంశాలను విచారిస్తామని స్పష్టం చేసింది. అయితే... ఆ తర్వాత కొందరు రైతులు, ప్రైవేటు వ్యక్తులు రాజధాని అంశానికి సంబంధించి పలు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో... వారి అభ్యర్థనలను కూడా పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం... తాజాగా వాద, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో జనవరి 31న తదుపరి విచారణ జరగనుంది.

IPL_Entry_Point