Attack On TDP Office : టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సుప్రీం కోర్టు తాజా విచారణ ఇదే
Attack On TDP Office : టీడీపీ ఆఫీసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. నిందితులు విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. వైసీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో అరెస్టు నుంచి ఉపశమనం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్ సహా మొత్తం 21 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ.. తొలుత జోగి రమేష్, దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ ఇద్దరు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై సెప్టెంబర్ 13న విచారణ జరిపిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. రెండు కేసుల్లో నిందితులుగా ఉన్న వారంతా తమ పాస్‌పోర్టులు వెంటనే దర్యాప్తు అధికారికి అందించాల్సిదేనని స్పష్టం చేసింది.
విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని, ఎప్పుడు పిలిచినా వెళ్లాల్సిందేనని ఆదేశాల్లో సుప్రీం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని, ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. నిందితులు విచారణకు సహకరించినంత వరకే ఈ రక్షణ ఉంటుందని మధ్యంతర ఉత్తర్వుల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ రెండు కేసుల్లో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం (అక్టోబర్ 20)న సాయంత్రం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలు చేస్తామని, అందుకోసం తమకు సమయం కావాలని వైసీపీ నేతల తరపున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌశల్, న్యాయవాది అల్లంకి రమేష్ ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. వైసీపీ నేతలు రీజాయిండర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది. దీంతో తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది.
డిసెంబర్ 17 వరకు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉపశమనం కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర, నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు నీరజ్ కిషన్ కౌశల్, అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.
2021లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో అక్కడ వైసీపీ నేతలు ఎవరూ లేరని, ప్రభుత్వం మారగానే టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని నిందితుల తరఫు లాయర్లు వాదించారు. మూడేళ్ల తరువాత ఈ కేసులో లేనివారిని కొత్తగా నిందితులుగా చేర్చారని వివరించారు. 307 లాంటి హత్యయత్నం కేసులు పెట్టారని, కక్ష సాధింపు చర్యల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. వారి వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. వైసీపీ నేతల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)