AP TG Temperatures : పెరుగుతున్న ఎండల తీవ్రత - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!
AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఎక్కువయ్యాయి. పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వడగాల్పు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ, తెలంగాణలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం పది దాటితే చాలు… ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లలేకపోతున్నారు.ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
గోస్పాడులో 42.8 డిగ్రీలు…
శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 42.8 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉలింద కొండలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, విజయనగరం జిల్లా పెదనదిపల్లిలో 41.7 డిగ్రీలు, వైఎస్సార్ జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అన్నమయ్య జిల్లా కంబాలకుంట 41.1 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతం, వడ్డాది, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 41 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత - ఈ జిల్లాలకు హెచ్చరికలు:
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది.ఇవాళ పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఇవాళ(మార్చి 15) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.ఈ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
శుక్రవారం ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతల్లో భారీగా మార్పు వచ్చింది. 4.9 డిగ్రీలు పెరిగి 40.8 డిగ్రీలు నమోదైంది.నిజామాబాద్‌లో 39.7 డిగ్రీలు, భద్రాచలంలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగిలిన జిల్లాల్లో కూడా రెండు డిగ్రీలపైన ఎండ తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం పడిపోవటంతో… ఉక్కపోత ఎక్కువైంది.
ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం బయటికి వెళ్లకపోవటం మంచిదని సూచిస్తున్నారు. ఎండ సమయంలో గొడుగులు వాడటం మంచిదని… మంచినీళ్లతో పాటు కొబ్బరినీళ్ల వంటి వాటిని క్రమంగా తీసుకోవాలని చెబుతున్నారు.
సంబంధిత కథనం