ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రుతుపవనాల రాక సమీపిస్తుండటంతో వాతావరణంలో ఆకస్మిక మార్పులు కనిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షాలతో రాయలసీమలో పలు ప్రాంతాలు తడిచి ముద్దయ్యాయి.
అనంతపురం జిల్లా రాప్తాడులోని ప్రజాశక్తి నగర్, సీపీఐ కాలనీలను వరద నీరు ముంచెత్తింది. ఫైర్ సిబ్బంది ముంపు బాధితులను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఐదున్నర వరద ముంచెత్తిన సమాచారం అందడంతో రోడ్లపైకి నీరు చేరడంతో స్థానిక ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు తరలించారు.
జంగాలపల్లి, గంగుల కుంట ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో వరద దిగువ ప్రాంతాలను ముంచెత్తింది. కల్వర్టులను తొలగించి వరద ప్రవాహం నుంచి బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. రెవిన్యూ సిబ్బంది పునరావాస చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయన్నారు. వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు పడేందుకు అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద నిలబడరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 54మిమీ, ఏలూరు జిల్లా నిడమర్రులో 54మిమీ, కాకినాడ జిల్లా కాజులూరులో 42 మిమీ, అనకాపల్లి జిల్లా పాతవలసలో 41మిమీ, కాకినాడ జిల్లా కరపలో 32.2మిమీ, పిఠాపురంలో 31.7మిమీ, అల్లూరి జిల్లా దళపతిగూడలో 31.5మిమీ వర్షపాతం నమోదైంది.
శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41-42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో5, పార్వతీపురంమన్యంలో-5 మండలాల్లో కలిపి మొత్తం 10 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది.
గురువారం బాపట్ల జిల్లా ఇంకొల్లు 42.6డిగ్రీలు, పల్నాడు జిల్లా వినుకొండ, నెల్లూరు జిల్లా దగదర్తిలో 42.5డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ముచ్చినపల్లిలో 41.9డిగ్రీలు, ప్రకాశం జిల్లా వేమవరంలో 41.7డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 41.5డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41.1డిగ్రీలు చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
సంబంధిత కథనం