Vizianagaram : విజయనగరంలో విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ.. సోలార్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ వాహనం తయారి!
Vizianagaram : విజయనగరం జిల్లాలో విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. సోలార్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ వాహనాన్ని తయారు చేశారు. అటు ప్రకాశం జిల్లాలో ఓ రైతు వినూత్న సాగు చేశారు. 1.20 ఎకరాల్లో అరవై రకాల వరి వంగడాలను పండించారు. వీటిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విజయనగరం జిల్లా గరివిడిలోని అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు వినూత్న ఆవిష్కరణ చేశారు. సోలార్ ఎలక్ట్రికల్ హైబ్రిడ్ వాహనాన్ని తయారుచేశారు. తమ సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సూర్య రెన్యువబుల్ ఎనర్జీ సిస్టమ్ సహకారంతో కళాశాలలో రెండు రోజులు కార్యశాల నిర్వహించారు. ఇక్కడ నేర్చుకున్న పరిజ్ఞానంతో ఈ వాహనాన్ని రూపొందించినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..
సోలార్ ప్యానల్ అమర్చడంతో.. వాహనం నడుస్తుండగానే ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ అవుతుందని విద్యార్థులు వివరించారు. ఫాల్ట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, ఆటో కట్ ఆఫ్ ఛార్జర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్టింగ్ అలారం, బ్యాలెన్స్‌డ్ రియల్ షాక్ అబ్జర్వర్స్, లోడ్ గేర్ సిస్టమ్ వంటి పరికరాలు ఉండడం దీని ప్రత్యేకత అని విద్యార్థులు చెబుతున్నారు.
ఆటోమేటిక్ ఛార్జింగ్..
దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అయ్యాక.. దాదాపు 300 కిలోల బరువుతో 80 నుంచి100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని.. ఆవిష్కర్తలు వివరిస్తున్నారు. ఆటోమేటిక్ ఛార్జింగ్ వల్ల మరో 20 కిలోమీటర్ల దూరం వెళ్లగలదని చెబుతున్నారు. ఈ ప్రయోగంలో భాగస్వాములైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌ను కళాశాల ప్రిన్సిపల్ వి.జాషువా జయప్రసాద్, అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని ప్రోత్సహించారు.
వినూత్న సాగు..
ఇటు ప్రకాశం జిల్లా పాకలకు చెందిన రైతు సుభాని వివిధ రకాల వరి వంగడాలను సాగుచేస్తున్నారు. పదోతరగతి వరకు చదువుకున్న సుభానికి.. ఆరోగ్యానికి మేలు చేసే వరి రకాలను పండించడమంటే ఆసక్తి. సోషల్ మీడియా ద్వారా పలు రకాల గురించి తెలుసుకుంటూ.. విత్తనాలు సేకరించి సాగుచేస్తున్నారు. ఆరేళ్లుగా ఈ వినూత్న సాగును కొనసాగిస్తున్నారు.
విద్యార్థులకు అవగాహన..
సుభాని ప్రస్తుతం 1.20 ఎకరాల విస్తీర్ణంలో 60 వరి రకాలు పండిస్తున్నారు. వీటిల్లో దత్వాన్, నవారా, మాండియా మాంజా, మురినీ ఖైమా, కిన్నార్, తులాయిపాజ్, బహుముఖి, బంగారు గులాబీ, రత్నచోడి వంటి వంగడాలు ఉన్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలతో పాటు, థాయ్‌లాండ్, అమెరికా దేశాల నుంచి ఈ విత్తనాలు సేకరించారు. పూర్తిగా ప్రకృతి విధానంలోనే సేద్యం చేస్తున్నారు. వీటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.