Pariksha Pe Charcha 2025 : ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం.. ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి
Pariksha Pe Charcha 2025 : విద్యార్థులకు ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా.. ప్రధానమంత్రి విద్యార్థులతో మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం.. https://innovateindia1.mygov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పరీక్షా పే చర్చ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రధాని మోదీ విద్యార్థులతో మాట్లాడనున్నారు. 2025 జనవరిలో నిర్వహించనున్న పరీక్షా పే చర్చకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈనెల 14న ప్రారంభం అయ్యింది. జనవరి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షా పే చర్చలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. https://innovateindia1.mygov.in/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఏం మాట్లాడతారు..
విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి. పరీక్షలు అంటే చిన్నారులకు భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ.. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే చిన్నారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇదే పరీక్షా పే చర్చ. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడి, ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
2500 మందికి అవకాశం..
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 2500 మంది విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఎంపికైన విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ నుంచి పీపీసీ కిట్‌లు అందిస్తారు. పరీక్షా పే చర్చలో పాల్గొనేవారిని ఎంపిక చేసేందుకు.. https://innovateindia1.mygov.in/ లో ఆన్‌లైన్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో పోటీ పరీక్ష నిర్వహిస్తున్నారు. జనవరిలో ఢిల్లీలోని భారత్ మండపం టౌన్ హాల్‌లో పరీక్ష పే చర్చ కార్యక్రమం జరగనుంది.
ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు..
పరీక్షాపే చర్చా 2025 కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు.. రిజిస్ట్రేషన్ చేసుకుని, పాల్గొనేలా చేయాలనే సూచనలతో.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఈ ఉత్తర్వులను విడుదల చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.