Kurnool Crime News : ప్రేమోన్మాది ఘాతుకం - విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య…!-student was killed by putting insecticide in her mouth in kurnool district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kurnool Crime News : ప్రేమోన్మాది ఘాతుకం - విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య…!

Kurnool Crime News : ప్రేమోన్మాది ఘాతుకం - విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య…!

HT Telugu Desk HT Telugu

ప్రేమించడం లేదన్న కారణంతో ఇంటర్ విద్యార్థిని ప్రేమోన్మాది హత్య చేశాడు. బలవంతంగా పురుగుమందు తాగించి చంపేశాడు. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లాలోని ఆస్ప‌రి మండల పరిధిలో వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క‌ర్నూలు జిల్లాలో ఘోరం (image source unsplash.com)

క‌ర్నూలు జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. విద్యార్థిని నోట్లో పురుగుల మందు పోసి హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు ఓ ప్రేమోన్మాది. ఆ విద్యార్థిని ఇంట్లోకి చొర‌బ‌డి ఆ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు. త‌ల్లిదండ్రులు పొలం ప‌నులు ముగించుకుని వ‌చ్చేస‌రికి ఆ విద్యార్థిని అప‌స్మార‌క స్థితిలో ప‌డింది. హుటాహుటినా ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ఆమె అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

ప్రేమ పేరుతో వేధింపులు… 

ఈ ఘోర‌మైన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా ఆస్ప‌రి మండ‌లం పరిధిలోని ఓ గ్రామంలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఒక కుటుంబంలో ఒక్క‌గానికి ఒక్క కుమార్తె ప‌త్తికొండ మోడ‌ల్ స్కూల్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతోంది. ఇటీవ‌లి ద‌స‌రా సెల‌వుల‌కు ఇంటికి ఆ విద్యార్థిని వ‌చ్చింది. అదే గ్రామానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థి స‌న్నీ ఆమెను గ‌త కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. సన్నీ ప్రేమ‌ను ఆమె నిరాక‌రించింది. తాను ప్రేమించ‌లేన‌ని, చ‌దువుకోవాలని స్ప‌ష్టం చేసింది.

దీంతో కోపంతో ర‌గిలిపోతున్న స‌న్నీ అదును చూసి త‌న ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. శుక్ర‌వారం ఆ విద్యార్థిని త‌ల్లిదండ్రులు పొలం ప‌నులు వెళ్లిపోయారు. ఇంట్లో ఎవ‌రూ లేకుండా ఆ విద్యార్థిని ఒంట‌రిగా ఉంది. ఈ స‌మయంలో స‌న్నీ ఆమె ఇంట్లోకి ప్ర‌వేశించాడు. త‌న‌ను ప్రేమించాల‌ని, ప్రేమించ‌క‌పోతే చంపేస్తాన‌ని వెంట తెచ్చుకున్న పురుగుల మందు డ‌బ్బా చూపుతూ ఆమెను బెదిరించాడు.

అయిన‌ప్ప‌టికీ బాలిక ఆ ప్రేమోన్మాది మాట లెక్క‌చేయ‌క‌పోవడంతో ఆమె నోట్లో బ‌ల‌వంతంగా పురుగుల మందు పోసి ప‌రార‌య్యాడు. కొద్దిసేప‌టికి విద్యార్థిని త‌ల్లిదండ్రులు పొలం పనులు ముగించుకుని ఇంటికి వ‌చ్చి చూసేస‌రికి కుమార్తె చావు బతుకుల్లో అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉంది. కొద్దిగా తెలివి ఉండ‌టంతో త‌ల్లిదండ్రుల‌కు కొన్ని విష‌యాలు చెప్పింది. త‌న‌కు స‌న్నీ అనే వాడు బ‌ల‌వంతంగా పురుగు మందు తాగించాడ‌ని తెలిపింది.

వెంట‌నే త‌ల్లిదండ్రులు ఆ విద్యార్థిని అదోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షించి అప్ప‌టికే ఆమె మ‌ర‌ణించిన‌ట్లు నిర్దారించారు. దీంతో త‌ల్లిదండ్రులు రోద‌న‌లు మిన్నంటాయి. ఆమె మృత దేహానికి పోస్టుమార్టం చేసిన కుటుంబ స‌భ్యులకు అప్ప‌గించారు. కుటుంబ స‌భ్య‌లు, బంధువులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. స్థానికంగా సంచ‌ల‌నం అయిన ఈ ఘ‌ట‌నపై త‌ల్లిదండ్రుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టి, విచార‌ణ చేప‌ట్టారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.