Palnadu Crime : పల్నాడు జిల్లాలో విషాదం.. ఇంటర్మీడియట్ విద్యార్థిని బలిగొన్న పెన్నుల పంచాయితీ
Palnadu Crime : పల్నాడు జిల్లాలో విషాదం జరిగింది. పెన్నుల కోసం జరిగిన గొడవ ఓ విద్యార్థినిని బలి తీసుకుంది. తోటి స్నేహితులు దూషించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని.. కాలేజీ హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట శివారులో ఓ ప్రైవేట్ కాలేజీ హాస్టల్‌లో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన జెట్టి హనుమంతరావు కుమార్తె అనూష (16). అనూష నరసరావుపేట శివారులోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. అదే కాలేజీకి చెందిన హాస్టల్‌లనే తోటి విద్యార్థులతో కలిసి ఉంటుంది.
ఇటీవల హాస్టల్‌లో పెన్నులు కనిపించకుండా పోతున్నాయి. పెన్నుల దొంగతనంపై విద్యార్థినుల మధ్య ఘర్షణ జరిగింది. ఇదే అంశంలపై నాలుగు రోజులుగా అనూషకు, ఆమె తోటి విద్యార్థినులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అందరూ అనూషను దూషించారు. దీంతో అనూష తీవ్ర మనస్తాపానికి గురైంది.
అనూష.. శనివారం కళాశాల హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్థానిక ఆసుపత్రి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. హాస్టల్ సిబ్బంది అనూష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనతో కాలేజీలోనూ, అనూష స్వగ్రామం వెల్లటూరులోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అనూష మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి జెట్టి హనుమంతరావు నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. పెన్నులు గురించి జరిగిన గొడవ విద్యార్థిని ప్రాణాన్ని బలిగొనడంపై కాలేజీ యాజమాన్యం, సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)