Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం.. ఫ్రెండ్ న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య!
Anantapur : అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. ఫ్రెండ్ విషెస్ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన.. చిన్నతిప్పమ్మ (17) బళ్లా రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ సెకెండ్ ఇయర్ చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంది. చిన్నతిప్పమ్మకు అదే కాలేజీలోని ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఫ్రెండ్ ఉంది. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసేవెళ్లేవారు.
అయితే మంగళవారం రాత్రి హాస్టల్‌లోని స్టూడెంట్స్ అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆ వేడుకల్లో చిన్నతిప్పమ్మకు తన బెస్ట్ ఫ్రెండ్ విషెస్ చెప్పలేదు. దీంతో తన బెస్ట్ ఫ్రెండే తనకు విషెస్ చెప్పలేదని మనస్తాపానికి గురైంది. బుధవారం హాస్టల్‌లోని మెస్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గుర్తించిన తొటి విద్యార్థులు.. చిన్నతిప్పమ్మ కుటుంబ సభ్యులకు, కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు.
పోలీసులకు సమాచారం..
అనంతపురం పోలీసులకు కూడా సమాచారం అందింది. అనంతపురం రూరల్ పోలీసులు హుటాహుటిన హాస్టల్‌కు చేరుకున్నారు. అక్కడ విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందడంతో.. హాస్టల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
అనుమానం..
అయితే విద్యార్థి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాల నేతలతో కలిసి ఆందోళనకు చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యంగా వల్లనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. కాలేజీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆత్మహత్య ఘటన కాలేజీలో కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖలో..
న్యూఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకుంటున్న వేళ అపశృతి చోటు చేసుకుంది. తలలోకి క్రాకర్స్ దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నంలోని ఉక్కు నిర్వాసిత రజక వీధిలో సుద్ధమల శివ (41) భార్య ధనలక్ష్మి, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. శివ వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికునిగా పని చేస్తున్నాడు. న్యూ ఇయర్ కావడంతో మంగళవారం అర్థరాత్రి తన ఇంటిపై కుటుంబంతో కలిసి శివ ఉత్సాహంగా గడిపారు.
అర్థరాత్రి 12 గంటల సమయంలో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా కేక్ కోసి అందరికి పంచారు. అనంతరం క్రాకర్స్ (షాట్స్) కాల్చారు. ఈ సమయంలో షాట్స్ ఒక్కసారిగా పేలి రెండు కళ్లను చీల్చుకుంటూ తలలోకి దూసుకుపోయింది. దీంతో శివ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే శివను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఆ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)