తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం భారీగా భక్తులు తరలివస్తుంటారు. రద్దీకి తగ్గట్టు తిరుపతిలో వసతులు లేవు. దీంతో అన్ని వసతులు ఒకే చోట లభించేలా చర్యలు చేపట్టారు. తిరుపతిలో ఇప్పుడున్న బస్టాండ్ స్థానంలోనే ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో బస్టాండ్, దానిపై 10 అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీల నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1.తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణ ఈ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఇందులో ఆర్టీసీ తన స్థలాన్ని కేటాయిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కొంత సొమ్ము, మరో ప్రైవేటు గుత్తేదారు సంస్థను ఎంపిక చేసి దాని ద్వారా కొంత డబ్బు వెచ్చించనున్నారు.
2.ప్రస్తుతం తిరుపతి బస్టాండ్ 13.18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 12.19 ఎకరాల్లో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. ప్రస్తుతం బస్టాండ్‌కు మూడు వైపులా రోడ్లు ఉన్నాయి. కొత్తగా నిర్మించే టెర్మినల్‌కు మాత్రం.. నాలుగు వైపులా రోడ్లు ఉండేలా డిజైన్ చేశారు.
3.సెల్లార్‌లో 2 అంతస్తులు ఉంటాయి. దీన్ని బైక్‌లు, కార్ల పార్కింగ్‌కు కేటాయిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్టాండ్‌కు కేటాయిస్తారు. 98 ప్లాట్‌ఫామ్‌లతో భారీ బస్టాండ్ నిర్మిస్తారు. అదనంగా 50 బస్సులు పార్కింగ్ చేసేలా, విద్యుత్ బస్సుల ఛార్జింగ్‌కు కూడా వీలుండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
4.మొదటి, రెండో అంతస్తుల్లో కొంతభాగం ఆర్టీసీ కార్యాలయాలకు కేటాయించగా.. మిగిలిన స్థలాన్ని ఫుడ్‌కోర్టులు, దుకాణాలు కేటాయిస్తారు. మూడో అంతస్తు కేవలం సర్వీసెస్ కోసం వదిలేస్తారు. భవనానికి సంబంధించి విద్యుత్ నిర్వహణ, సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ వంటివి ఇందులో ఉంటాయి.
5.నాలుగు నుంచి ఏడో అంతస్తు వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వాణిజ్య అవసరాలకు కేటాయించనున్నారు. ఎనిమిది, తొమ్మిది, పదో అంతస్తుల్లో కమర్షియల్‌గా బ్యాంకులు, ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు.. ఇతర అవసరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు.
6.దీని పదో అంతస్తుపైన హెలిప్యాడ్ నిర్మాణం చేయనున్నారు. మొత్తంగా 1.54 లక్షల చదరపు అడుగుల మేర బిల్ట్‌అప్ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు విలువైన స్థలాన్ని కేటాయిస్తుండటంతో.. ఆర్టీసీ నిధులేమీ వెచ్చించదని తెలుస్తోంది.
7.ఈ భారీ ప్రాజెక్టు పూర్తయి అందుబాటులోకి వచ్చాక.. హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, బ్యాంకులు, కార్యాలయాలు.. తదితరాలకు స్పేస్ కేటాయింపు ద్వారా వచ్చే రాబడిలో.. ఆర్టీసీ, ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్, గుత్తేదారు సంస్థల్లో ఎవరికి ఎంత వాటా అనేది ఒప్పందం చేసుకుంటారు.
8.కొత్తగా బస్ టెర్మినల్ నిర్మాణ సమయంలో.. ప్రస్తుత బస్టాండ్‌ను రెండు, మూడు చోట్లకు మార్చనున్నారు. కొన్ని బస్సులను మంగళం డిపోకి, అలిపిరి సమీపంలో టీటీడీకి చెందిన స్థలం, తిరుచానూరు మార్గంలో కొన్ని చోట్ల తాత్కాలిక బస్టాండ్లులా ఏర్పాట్లు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
9.తిరుమలకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకొని.. ఆర్టీసీతో కలిసి ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ ఈ బస్ టెర్మినల్ నిర్మాణానికి ముందుకొచ్చింది. అందుకే డిజైన్ రూపొందించే బాధ్యత రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్ లిమిటెడ్‌కు అప్పగించారు.
10.శ్రీవారి ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తాజాగా ఈ డిజైన్ ఖరారు అయింది. ముఖద్వారం తిరుమల ఆలయాన్ని తలపించేలా రూపొందించారు. రైల్వేస్టేషన్ నుంచి నేరుగా బస్టాండ్‌కు చేరుకునేలా కిలోమీటర్ మేర స్కైవాక్ నిర్మించనున్నారు.
సంబంధిత కథనం