విజయవంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, ఈసారి ఎన్ని కోట్లంటే…?-srivari annual brahmotsavam was successfully conducted in tirumala 2025 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విజయవంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, ఈసారి ఎన్ని కోట్లంటే…?

విజయవంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, ఈసారి ఎన్ని కోట్లంటే…?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. ఈ 8 రోజుల్లో 5.8 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. కానుకల ద్వారా రూ. 25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - 2025

తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అన్ని విభాగాలు సమిష్టిగా , స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వివరాలను వెల్లడించారు. టీటీడీ సిబ్బంది సంయ‌మనంతో, ప్ర‌ణాళిక బ‌ద్ధంగా, సీనియ‌ర్ అధికారుల ప‌ర్యవేక్ష‌ణ‌లో సేవ‌లందించార‌ని తెలిపారు.

శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను దిగ్విజ‌యం చేసిన టీటీడీ అర్చ‌క స్వాముల‌కు, అధికారులు, ఉద్యోగులు, జిల్లా, పోలీసు యంత్రాంగం, శ్రీ‌వారి సేవ‌కులు, మీడియా, భ‌క్తుల‌కు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు. ప్ర‌పంచం న‌లుమూల‌ల నుండి బ్ర‌హ్మోత్ప‌వాల‌కు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు 16 శ్రీ‌వారి వాహ‌న సేవ‌ల‌తో పాటు మూల‌మూర్తి ద‌ర్శ‌నం క‌ల్పించామని తెలిపారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ముఖ్యమైన గ‌రుడ‌సేవ రోజున భ‌క్త‌లంద‌రికీ ద‌ర్శ‌నం క‌ల్పించామని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. గ‌రుడ‌సేవ రోజున హోల్డింగ్ పాయింట్ల ద్వారా ఈసారి అద‌నంగా 30వేలు, రీఫిల్లింగ్ ద్వారా 15వేల మందికి ద‌ర్శ‌నం కల్పించినట్లు పేర్కొన్నారు.

ఆదాయం ఎంతంటే..?

బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఈ 8 రోజుల్లో 5.80 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకోగా…. రూ.25.12 కోట్లు హుండీ ఆదాయం వ‌చ్చింది. “26 ల‌క్ష‌ల మంది భ‌క్తుల‌కు పైగా అన్న ప్ర‌సాదాలు పంపిణీ చేశాం. 2.42 ల‌క్ష‌ల మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. 28 ల‌క్ష‌ల‌కు పైగా ల‌డ్డూల‌ను భ‌క్తుల విక్ర‌యించ‌డం జ‌రిగింది. ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా తిరుప‌తి నుండి తిరుమ‌ల‌కు 14,459 ట్రిప్పుల ద్వారా 4.40ల‌క్ష‌ల మంది, తిరుమ‌ల నుండి తిరుప‌తికి 14,765 ట్రిప్పుల ద్వారా 5.22 ల‌క్ష‌ల మంది భ‌క్తులను చేర‌వేశాం” అని ఛైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు.

28 రాష్ట్రాల నుండి 298 క‌ళా బృందాల‌లో, దాదాపు 6,976 మంది క‌ళాకారులు, అదే విధంగా గ‌రుడ‌సేవ రోజు 20 రాష్ట్రాల నుండి 37 క‌ళా బృందాల‌తో 780 క‌ళాకారులతో ప్ర‌ద‌ర్శ‌ించారు. బ్ర‌హ్మోత్స‌వాల‌లో 60 టన్నులు పుష్పాలు, 4 ల‌క్ష‌ల‌ కట్‌ ఫ్లవర్స్‌, 90 వేల సీజనల్ ఫ్లవర్స్ వినియోగించారు. బ్ర‌హ్మోత్స‌వాల్లో ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు 3500 మంది శ్రీ‌వారి సేవ‌కులు విశేష‌ సేవ‌లందించారు.

బ్ర‌హ్మోత్స‌వాల‌కు 4వేల మంది పోలీసులు, 1800 మంది విజిలెన్స్ సిబ్బందితో భ‌ద్ర‌త‌ కల్పించారు. గ‌రుడ సేవ రోజున అద‌నంగా 1000 మంది పోలీసులు విధులు నిర్వర్తించారని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం