Srisailam Temple Lands : నెలాఖర్లోగా శ్రీశైలం భూములకు సరిహద్దులు….-srisailam temple lands will fiexed by october month ending ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Srisailam Temple Lands Will Fiexed By October Month Ending

Srisailam Temple Lands : నెలాఖర్లోగా శ్రీశైలం భూములకు సరిహద్దులు….

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 08:12 AM IST

Srisailam Temple Lands శ్రీశైల దేవస్థానం అభివృద్దికి ఆటంకంగా మారిన దేవస్థాన భూముల సరిహద్దులు నిర్ధారించేందుకు ప్రభుత్వ శాఖలు సిద్దమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శ్రీశైల దేవస్థానం భూముల్ని అక్టోబర్‌ చివరికి నిర్ధారించనున్నారు.

నెలాఖర్లోగా శ్రీశైలం భూములకు సరిహద్దులు
నెలాఖర్లోగా శ్రీశైలం భూములకు సరిహద్దులు

Srisailam Temple Lands శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేస్తామని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్దికై మాస్టర్ ప్లాన్ తయారీ చేసేందుకు మరియు ఇతర అభివృద్ది పనులను చేపట్టేందుకు దేవస్థానం భూముల సరిహద్దులు ఇప్పటి వరకూ సరిగా ఖరారు కాకపోవడం పెద్ద ఆటంకంగా మారిందని మంత్రి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

శ్రీశైల భూముల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్సు & టెక్నాలజీ, గనులు, భూగర్బ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ & స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంయుక్త నేతృత్వంలో సంబందిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల అంశంపై సమగ్రంగా సమీక్షించుకుని కొన్ని నిర్ణయాలను తీసుకున్నారు.

అటవీ, రెవెన్యూ, సర్వే అండ్ లాండ్ రికార్డ్సు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సంయుక్త ఆద్వర్యంలో దేవస్థానం భూముల సర్వే కార్యక్రమాన్ని త్వరలో చేపడతారని మంత్రి ప్రకటించారు. బ్రిటీష్ పరిపాలనా కాలం 1879 సంవత్సరం ప్రాంతంలో 7 చదరపు మైళ్ల భూమి అంటే దాదాపు 4,130 ఎకరాల భూమిని శ్రీశైల దేవస్థానానికి కేటాయించారు. అదే విధంగా 1967 ప్రాంతంలో మరో 145 ఎకరాల భూమిని ప్రభుత్వం శ్రీశైల దేవస్థానానికి కేటాయించిందన్నారు.

మరోవైపు నాగార్జున సాగర్ – శ్రీ శైలం టైగర్ రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో ఈ దేవస్థానం భూములు ఉండటంతో ఎటు వంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలన్నా ఈ భూముల సరిహద్దుల ఖరారు తప్పనిసరైందని మంత్రి చెప్పారు. అక్టోబరు నెలాఖరులోపు ఈ దేవస్థానం భూముల సరిహద్దుల ఖరారు ప్రక్రియ పూర్తియిన వెంటనే దేవస్థానం అభివృద్దికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందించడంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను చేపడతామని మంత్రి చెప్పారు.

రిజర్వ్ ఫారెస్టు నియమ నిబంధనలను అతిక్రమించకుండా దేవస్థానానికి చెందిన భూముల్లో పర్యావరణ మరియు మతపరమైన పర్యాటక ప్రాంతాలను అభివృద్ది పరుస్తామని చెప్పారు. శ్రీశైల దేవస్థానం భూముల సమస్యను ఒక కొలిక్కితెచ్చేందుకు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంధ్రారెడ్డికి మరియు ధర్మాన ప్రసాదరావు అయా శాఖల తరపున సహకరిస్తున్నారని చెప్పారు.

WhatsApp channel

టాపిక్