Srisailam Mahashivratri : శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, నాలుగు రోజులు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం
Srisailam Mahashivratri : శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మంత్రుల బృందం ఏర్పాట్లపై సమీక్షించి పలు కీలక సూచనలు చేశారు. అలాగే శివరాత్రికి వచ్చే భక్తుల సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Srisailam Mahashivratri : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శక్తి పీఠం, జ్యోతిర్లింగం కొలువైన ప్రదేశం కావడంతో మహాశివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినాన శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకుని తరిస్తుంటారు భక్తులు. ఇటీవల తిరుపతి దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
మహాశివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం శ్రీశైలం వచ్చి సమీక్ష నిర్వహించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించింది. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాలను శ్రీశైలం వచ్చే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం
శ్రీశైలం ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులపాటు భక్తులకు ఉచితంగానే లడ్డూ ప్రసాదం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రుల బృందం ప్రకటన చేసింది. అలాగే క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీళ్లు బాటిల్, పాలు, బిస్కెట్లు ఉచితంగా అందజేయనున్నారు.
శ్రీశైలం క్షేత్ర పరిధిలో పార్కింగ్ ప్రదేశాల నుంచి భక్తులను వసతి గృహాలకు, సత్రాలకు తరలించేందుకు ఉచిత మినీ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున(25, 26 తేదీల్లో)దేవస్థానం టోల్ గేట్ రుసుము లేకుండా ఉచితంగా వాహనాలను అనుమతించాలని మంత్రుల బృందం నిర్ణయించింది.
క్యూలైన్లలో పాలు, మంచినీరు, అల్పాహారం
సీఎం చంద్రబాబు ఆదేశాలతో శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి 30 శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. సామాన్య భక్తునికి స్వామి అమ్మవార్ల దర్శనం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూ లైన్ లో భక్తులకు పాలు, మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రుల బృందం ఆలయ అధికారులను ఆదేశించారు.
కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
చిన్న పిల్లలతో వచ్చే వారి పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రుల బృందం అధికారును ఆదేశించారు. మహాశివరాత్రి పర్వదినాలు 24, 25, 26, 27 తేదీల్లో క్యూలైన్లలో వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీశైలం రూట్లలో ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీసులకు ఇచ్చేందుకు దేవదాయశాఖ సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీకి తెలిపారు.
40 కి.మీ మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచు గూడెంలలో ప్రత్యేక బృందాలతో మంచినీరు, బిస్కెట్లు ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను మంత్రుల బృందం ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కీలక సూచనలు చేశారు.
సంబంధిత కథనం