Srisailam Karthika Masam 2024 : శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్,నవంబర్ 2 కార్తీక మాసోత్సవాలు-స్పర్శ దర్శనం ఈ రోజుల్లోనే
Srisailam Karthika Masam Utsavalu 2024 : శ్రీశైలం దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల రోజులు గర్భాలయ అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

కార్తీకమాసం అంటే పరమ శివుడికి అత్యంత ప్రీతికరమని భక్తులు నమ్మకం. ఈ ఏడాదికి నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతోంది. శ్రీశైలంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నారు. కార్మీక మాసంలో నిర్వహించే ఉత్సవాలను గురించి మంగళవారం ఈవో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. కార్తీక మాసంలో శ్రీశైలంలో గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. శని, ఆది, సోమవారం, కార్తీక పౌర్ణమి, ఏకాదశి రోజులలో స్వామి వారి స్పర్శ దర్శనం, అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తామన్నారు.
నవంబర్ 15న కార్తీక పౌర్ణమి
భక్తుల రద్దీ ఎక్కువ ఉంటే అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల వేస్తామని ఈవో తెలిపారు. అయితే అమ్మవారి ఆశీర్వచన మండపంలోకి అనుమతిస్తామన్నారు. రద్దీ తక్కువగా ఉంటే సామూహిక అభిషేకాలకు అవకాశం కల్పిస్తామన్నారు. భక్తులు కార్తీక దీపారాధన చేసుకునేందుకు ఆలయ ఉత్తర మాడవీధిలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా కృష్ణమ్మకు నదీహారతి, సారే సమర్పణ, జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహిస్తామని ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
శ్రీశైలంలో బయటపడిన 14వ శతాబ్దపు శివలింగం
నంద్యాల జిల్లాలోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో శివలింగం బయటపడింది. 14వ లేదా 15వ శతాబ్దానికి చెందినదిగా అంచనా వేస్తున్న మధ్యయుగ శివలింగం ఆలయ యాంఫీ థియేటర్ సమీపంలో పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. శివలింగంతో పాటు తెలుగు లిపిలో ఒక శాసనం కూడా ఉంది. ఈ లిపి కూడా మధ్యయుగానికి చెందినదే అని పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. శివుడు, పార్వతిదేవీ కొలువుదీరిన ఈ ఆలయాన్ని శివుని పన్నెండు 'జ్యోతిర్లింగాలలో' ఒకటిగా, పద్దెనిమిది 'శక్తి పీఠాలలో' ఒకటిగా భక్తులు చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో కొత్త రహదారి, గోడ నిర్మాణ పనులు చేపడుతుండగా.. శివలింగం, శాసనం కనిపించినట్లు తెలుస్తోంది. ఈ చారిత్రక వస్తువులను గుర్తించిన కార్మికులు వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు శివలింగం, మరియు శాసనాన్ని పరిశీలించి విశ్లేషణ కోసం మైసూర్ పురావస్తు శాఖకు పంపారు.
ఈ లింగాన్ని సిద్ధదేవ శిష్యుడైన కంపిలయ్య ప్రతిష్టించారని పురావస్తుశాఖ ప్రాథమిక పరీక్షల్లో తేల్చింది. ఈ శాసనంలో అక్కడి చక్రగుండం, సారంగధర మఠం, రుద్రాక్ష మఠాన్ని తెలియజేస్తున్నాయి. ఈ ఆవిష్కరణ శ్రీశైలం దేవాలయం చరిత్రకు మరిన్ని ఆధారాలు అందించిందని అధికారులు అంటున్నారు. శ్రీశైల ఆలయ మొత్తం 2 హెక్టార్లలో విస్తరించి ఉంది. అనేక శిల్పాలతో అలంకరించబడిన నాలుగు గోపురాలు ఉన్నాయి.
శ్రీశైలం ఆలయం నల్లమల అడవులలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంటుంది. ఈ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసే సమయంలో పర్యాటకలు పెద్ద సంఖ్యలు వస్తుంటారు. అలాగే శ్రీశైలం రోప్ వే, బోట్ జర్నీ ఎంజాయ్ చేయవచ్చు. పర్యాటకలు అటు దైవదర్శనంతో పాటు మానసిక ఉల్లాసానికి శ్రీశైలం చక్కని ప్రదేశం.