Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద, 10 గేట్లు ఎత్తివేత
Srisailam Dam : శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా వరద పోటెత్తడంతో అధికారులు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Srisailam Dam : శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తుంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,79,822 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో , 3,32,447 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883.9 అడుగులకు చేరుకుంది.
కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి
శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ 209.6 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.8 టీఎంసీలు. దీంతో 10 క్రెస్ట్ గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల ఎత్తుకు ఎత్తి స్పిల్‌వే ద్వారా దాదాపు 2.76 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరో 57కే క్యూసెక్కుల నీటిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేశారు. శ్రీశైలం డ్యామ్‍లో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది. దీంతో మొత్తం 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. ఆగస్టు 1న శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు.
సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్
ఎల్లుండి ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైలం క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 1వ తేదీ ఉదయం 10:30 హెలీకాఫ్టర్ లో సున్నిపెంటకు చేరుకుని అనతరం శ్రీశైలం క్షేత్రానికి రోడ్డుమార్గంలో వెళ్తారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను సీఎం దర్శించుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను సందర్శించి కృష్ణమ్మకు హారతి ఇస్తారు. తర్వాత ఏపీ జెన్కో అధికారులతో భేటీ అయ్యి విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలిస్తారు. తర్వాత సున్నిపెంటలో ఏర్పాటు చేసిన ప్రజావేదికకు చేరుకుని రైతులు, అధికారులతో ముఖాముఖిగా మాట్లాడతారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు సున్నిపెంట నుంచి శ్రీసత్యసాయి జిల్లా మడకశిర బయలుదేరతారు. మడకశిరలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు రానున్నారు.
సంబంధిత కథనం