Amaravati Srivari Temple : ఈనెల 15న అమరావతిలో శ్రీనివాస కల్యాణం - టీటీడీ విస్తృత ఏర్పాట్లు-srinivasa kalyanam will be conducted on march 15 at the srivari temple in amaravati ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Srivari Temple : ఈనెల 15న అమరావతిలో శ్రీనివాస కల్యాణం - టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Amaravati Srivari Temple : ఈనెల 15న అమరావతిలో శ్రీనివాస కల్యాణం - టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Mar 13, 2025 05:25 PM IST

అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. ఇందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా క‌ల్యాణ‌ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాల‌ని ఈవో శ్యామలరావు ఆదేశించారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న టీటీడీ ఈవో
ఏర్పాట్లు పరిశీలిస్తున్న టీటీడీ ఈవో

అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

టీటీడీ ఈవో కీలక సూచనలు…

శ్రీ‌నివాస క‌ల్యాణంపై వెంక‌ట‌పాలెం సమీపంలోని గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించాలన్నారు. భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా క‌ల్యాణ‌ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. శ్రీ‌వారి ఆల‌యం, క‌ల్యాణ వేదిక ప‌రిస‌రాల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా విద్యుత్ అలంక‌ర‌ణలు చేప‌ట్టాలన్నారు.

శ్రీవారి ఆలయానికి విచ్చేసి భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలని ఈవో సూచించారు. ట్రాఫిక్ అంత‌రాయం త‌లెత్త‌కుండా పార్కింగ్ ఏర్పాట్లు చేసి వాహ‌నాల‌ను క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో పార్కింగ్ చేసేలా ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్టమ్ ద్వారా సూచ‌న‌లు చేయాల‌ని కోరారు.

క‌ల్యాణానికి భజన బృందాలు , శ్రీవారి సేవకులను పెద్ద ఎత్తున ఆహ్వానించాల‌ని ఆదేశించారు. జిల్లా, టీటీడీ అధికారుల కోసం ప్రత్యేకంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టి సీసీ కెమెరాల‌తో నిరంత‌రం భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించాల‌ని దిశానిర్దేశం చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు సులువుగా వచ్చేందుకు వీలుగా తగినన్ని ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవో సూచించారు. స్వామివారి కళ్యాణాన్ని నేరుగా చూడలేని లక్షలాది మంది భక్తుల సౌలభ్యం కొరకు శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయాల‌ని ఆదేశించారు. వేదిక పరిసరాలలో చెత్త‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తొల‌గించి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

అత్యవ‌స‌ర స‌మ‌యంలో త‌క్ష‌ణం స్పందించేలా విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని ఈవో శ్యామలరావు సూచించారు. భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలు , మందులు, సిబ్బంది, అంబులెన్సులు అందుబాటులో ఉంచాల‌న్నారు. భ‌క్తుల‌కు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు అవ‌స‌ర‌మైన శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేసుకోవాల‌ని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా హెచ్ డీపీపీ కార్యదర్శిని ఆదేశించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner