Srikakulam Crime : శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. బిస్కెట్లు ఆశచూపి ఆరేళ్ల చిన్నారిపై వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన శ్రీకాకుళం నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం నగరంలో ఒక అపార్ట్‌మెంట్‌లో పొందూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి (80) సెక్యూరిటీ గార్డుగా ఉంటున్నాడు. ఆయన భార్య అదే అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్‌ల్లో పనులు చేస్తోంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో గదిలో ఆ కుటుంబం నివాసం ఉంటుంది.
అయితే ఎదురుగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఆరేళ్ల చిన్నారిని ఆయన ఎప్పటికప్పుడు పిలిపించుకుని చాకెట్లు, బిస్కెట్లు ఆ చిన్నారికి ఇస్తుండేవాడు. ఈనెల 16 (ఆదివారం) కూడా వీరు ఉండే అపార్ట్‌మెంట్ గది వద్దకు బాలిక వచ్చింది. ఆ బాలికను సెల్లార్‌లోని ఉన్న కార్ల వెనకకు తీసుకెళ్లి బాలికను తాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీన్ని గమనించిన ఆమె తల్లి అప్రమత్తమై అక్కడకు చేరుకుని తన కుమార్తెను లాగేసింది. ఆ వృద్ధుడిని ఆమె గట్టిగా నిలదీయగా అక్కడ ఉంచి ఆయన వెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లిన ఆమె జరిగిన విషయాన్ని భర్తకు తెలిపింది. దీంతో సోమవారం భర్త శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని టూ టౌన్ సీఐ ఈశ్వరరావు తెలిపారు. దర్యాప్తు పూర్తి అయిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. డీఎస్పీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతుందని తెలిపారు. వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు.
తాను పోలీసునని బెదిరించి మహిళపై ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి జైలు శిక్ష విధించారు. నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమలకు చెందిన ఉప్పు నాగహరికృష్ణ ఒక మహిళను బెదిరించి అత్యాచారం చేశాడు. నిందితుడికి శిక్ష విధిస్తూ సోమవారం కర్నూలు జిల్లా మహిళ కోర్టు న్యాయమూర్తి వి.లక్ష్మీరాజ్యం తీర్పు ఇచ్చారు. నిందితుడికి జీవిత కాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన మహిళ అన్న అనారోగ్యంతో బాధపడుతుండేవారు. నంద్యాల జిల్లా సంజామల మండలం విష్ణుగంటి క్షేత్రంలో చేర్పిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని కొందరు చెప్పడంతో ఆమె తన అన్నను అందులో చేర్పించారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా అన్న కనిపించకపోవడంతో ఆమె తన కుమారుడితో కలిసి తలోవైపు వెళ్లి వెతుకుతున్నారు. పేరుసోమల మార్గంలో చౌడేశ్వరి ఆలయం వైపు ఆమె వెతుకుతూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చిన ఉప్పు నాగ హరికృష్ణ గమనించాడు. మీ అన్నయ్య ఎస్సార్బీసీ కాలువ వద్ద ఉన్నాడని ఆమెను నమ్మించి తన వాహనంపై ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లే సరికీ ఆమె అనుమానం వచ్చి, ఆపమని చెప్పింది. అయినప్పటికీ వాహనం ఆపకుండా వెళ్తున్నాడు. దీంతో భయపడిపోయిన ఆమె ద్విచక్ర వాహనం నుండి దూకి పారిపోయేందుకు ప్రయత్నించింది.
ఆమెను పట్టుకుని బెదిరించి అత్యాచారం చేశాడు. తాను పోలీసునని, ఎవరికైనా చెబితే గన్‌తో కాల్చేస్తానని బెదిరించాడు. ఆ తరువాత బాధితురాలు తనలో తాను కుమిలిపోయింది. దీన్ని గమనించిన కుమారుడు ఏమైందని తల్లిని అడిగాడు. అప్పుడు కుమారుడికి తల్లి జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో తల్లితో కలిసి కుమారుడు సంజామల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కేసు విచారణ జరిపారు. అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి జీవితకాల జైలు శిక్ష, రూ.10 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం