Private College Principal : హోలీ పేరుతో విద్యార్థినుల పట్ల ప్రిన్సిపాల్ అనుచిత ప్రవర్తన, కేసు నమోదు
Private College Principal : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ ప్రైవేట్ కాలేజీ ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. హోలీ సంబరాల పేరిట ఎక్కడిపడితే అక్కడ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ప్రిన్సిపాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Private College Principal : శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. విద్యా బుద్ధులు నేర్పి, ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు బాటలు వేయాల్సిన ప్రిన్సిపాల్ విద్యార్థినిల పట్ల వికృతంగా ప్రవర్తించాడు. హోలీ సందర్భంగా కాలేజీకి సెలవు అయినప్పటికీ, స్పెషల్ క్లాస్ పేరుతో విద్యార్థినీలను కాలేజీకి ప్రిన్సిపాల్ రమ్మన్నారు. దీంతో ప్రిన్సిపల్ ఆదేశాల మేరకు విద్యార్థినిలు కాలేజీకి వెళ్లారు. అయితే అక్కడ స్పెషల్ క్లాస్ కాకుండా, హోలీ ఆటను ప్రిన్సిపాల్ మొదలుపెట్టాడు. ఈ క్రమంలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. కానిస్టేబుల్ ఫిర్యాదుతో ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు అయింది.
ప్రిన్సిపాల్ వికృత చేష్టలు
ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. కదిరి పట్టణంలో ఓ ప్రైవేట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి హోలీ పండగ రోజున విద్యా సంస్థలకు సెలవు. అయినప్పటికీ ప్రిన్సిపాల్ వెంకటపతి స్పెషల్ క్లాస్ పేరుతో డిగ్రీ విద్యార్థినులను కాలేజీకి రమ్మన్నారు. ప్రిన్సిపాల్ ఆదేశాలతో విద్యార్థినులు కాలేజీకి వచ్చారు. ప్రిన్సిపాల్ హోలీ సంబరాలకు తెరలేపారు. ఈ క్రమంలో రంగులు చల్లుకుంటూ విద్యార్థినులను పదే పదే తాకుతూ వికృతంగా ప్రవర్తించాడు. విద్యార్థినులు పరిగెత్తుతుంటే, వారి వెంటపడి తరుముతూ ఎత్తుకోవడం, అవయవాలను తాకుతూ నేలపై దొల్లించడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అమ్మాయిలను ఒకరి తరువాత ఒకరిని ఎత్తుకుని బురదలో పడేసి, వారిపై పడి ఎక్కడపడితే అక్కడ తాకడం వంటివి చేష్టలకు దిగారు.
ప్రిన్సిపల్ చర్యలను గమనించిన స్థానికులు అసభ్యకర ప్రవర్తనను వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన, వికృత చేష్టల దృశ్యాలు సోషల్ మీడియాల్లో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరోవైపు ఎఐఎస్ఎఫ్, పీఎస్ఎఫ్ఏ, ఎన్ఎస్‌యూఐ తదితర విద్యార్థి సంఘాలు కేసు నమోదు చేయాలని శనివారం ఆందోళన చేపట్టాయి. వెంటనే అధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్పెషల్ క్లాస్‌ల పేరుతో పిలుపించుకుని, ఇలాంటి చేష్టలకు ఒడిగట్టడానికి సిగ్గుచేటని అన్నారు. బాధ్యతాయుతమైన ప్రిన్సిపాల్ ఇలానే చేస్తారా? అంటూ ప్రశ్నించారు. విద్యా బుద్ధులు నేర్పించాల్సి, వారి బంగారు భవిష్యత్తుకు హామీగా ఉండాల్సిన ప్రిన్సిపాలే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విమర్శించారు.
ప్రిన్సిపాల్ పై కేసు నమోదు
అయితే హోలీ సంబరాల్లో విద్యార్థినీలను భౌతికంగా తాకుతూ ప్రిన్సిపాల్ వెంకటపతి వ్యవహరించిన తీరుపై కానిస్టేబుల్ గౌసియా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ సెక్షన్ 75 కింద కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి తెలిపారు. అనంతరం శనివారం ఆయనను అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తి తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇలా ప్రవర్తించడం మంచిది కాదని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించమని, ఇలాంటి చర్యల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ ప్రవర్తనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత హోలీ అయితే ఇంతలా ప్రవర్తిస్తారా? అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో ప్రిన్సిపాల్ అసలు స్వరూపం బయపటడిందని, బయటపడకుండా ఆయన ఇంకేమీ చేశాడో అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యవహారంపై విచారణ జరపాలని, విద్యార్థినీల పట్ల ఆయన వికృత చేష్టలపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వి.రత్న విచారణకు ఆదేశించారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం