Ganta SrinivasaRao : మళ్లీ వార్తల్లోకి గంటా… పార్టీ మార్పు ఊహాగానాలు…-speculations over ex minister ganta srinivasarao will join ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Speculations Over Ex Minister Ganta Srinivasarao Will Join Ysrcp

Ganta SrinivasaRao : మళ్లీ వార్తల్లోకి గంటా… పార్టీ మార్పు ఊహాగానాలు…

HT Telugu Desk HT Telugu
Nov 27, 2022 11:10 AM IST

Ganta SrinivasaRao మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి వార్తల్లోకి వచ్చారు. గత కొంత కాలంగా స్తబ్దుగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. గంటా పార్టీ మార్పుకు వైసీపీ అగ్ర నాయకత్వం నుంచి అమోదం లభించిందని త్వరలోనే మార్పు ఖాయమని ఉత్తరాంధ్రలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో గంటా శ్రీనివాసరావు
టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో గంటా శ్రీనివాసరావు (Twitter)

Ganta SrinivasaRao మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోమారు వార్తల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు టీడీపీ ఓటమి పాలవ్వడంతో అప్పట్లోనే పార్టీ ఫిరాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే గంటాను పార్టీలో చేర్చుకోవడాన్ని మాజీ మంత్రి ఆవంతి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన విషయం ఎటూ తేలకుండా పోయింది. విశాఖపట్నం నాయకుల అభ్యంతరాల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావును చేర్చుకోడానికి జగన్మోహన్ రెడ్డి తటపటాయించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవలి కాలంలో వైసీపీలో అంతర్గత పరిస్థితుల్లో మార్పులు రావడంతో గంటాకు రాకకు మార్గం సుగమం అయ్యింది. గత మూడున్నరేళ్లుగా గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నా క్రియాశీల రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మాత్రమే అందుబాటులో ఉంటూ, పార్టీ వ్యవహారాలకు దూరం పాటిస్తున్నారు. దీనిపై టీడీపీలో కూడా అసంతృప్తి నెలకొంది. మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వ్యవహార శైలిపై గంటా అసంతృప్తిగా ఉన్నారని ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు తగినంత మర్యాద దక్కకపోవడంతోనే పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చారు.

తాజా పరిణామాలపై గంటా శ్రీనివాసరావు స్పందించకపోయినా డిసెంబర్‌లో ఆ‍యన పుట్టిన రోజు తర్వాత పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడాన్ని ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు ఎవరు పెద్దగా వ్యతిరేకించడం లేదు. ఆవంతి శ్రీనివాసరావు వంటి వారికి గంటా రాక రుచించకపోయినా వైసీపీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితులు లేవంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాసరావు గతంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

వైసీపీలోకి ఎవరైనా రావొచ్చు….!

వైఎస్సార్‌ సీపీలోకి ఎవరైనా రావొచ్చని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

పార్టీలో పదవులో, మరొకటో ఆశించి చేరవద్దని హితవు పలికారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైఎస్సార్‌ సీపీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు.

టీడీపీ నాయకుడు లోకేష్‌ పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్‌ చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలు చేసిన పాదయాత్రలకు అర్థం ఉందన్నారు. అప్పట్లో రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని వారు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల తర్వాత కూడా ప్రజా ప్రతినిధులు గ్రామాలకు వెళ్లి తలెత్తుకు తిరుగుతున్నారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎంతో సంతృప్తిగా ఉన్న ప్రజలు తమను సాదరంగా ఆహ్వానిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు.

లోకేష్‌ 4 వేల కిలోమీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు పాక్కుంటూ పాదయాత్ర చేసినా టీడీపీని అధికారంలోకి తీసుకు రాలేరన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో మళ్లీ బిల్లు ప్రవేశపెడతామని, త్వరలోనే సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని అమర్‌నాథ్‌ చెప్పారు.

WhatsApp channel

టాపిక్