Kanna Lakshminarayana Fate : కన్నా రాజకీయ భవితవ్యం…-speculation over kanna lakshmi narayana political journey in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Speculation Over Kanna Lakshmi Narayana Political Journey In Andhra Pradesh

Kanna Lakshminarayana Fate : కన్నా రాజకీయ భవితవ్యం…

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 09:53 AM IST

Kanna Lakshminarayana Fate మాజీ మంత్రి, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ భవితవ్యం ఇప్పుడు అందరిలోను ఆసక్తి కలిగిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభజన వేడి రేగుతున్న సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెరపైకి వచ్చిన కన్నా దాదాపు పదేళ్లుగా పదవులకు దూరమయ్యారు. 2024 ఎన్నికల్లో కన్నా భవిష్యత్తు ఏమిటనేది అందరిలోను ఆసక్తి కలిగిస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ దారెటు
కన్నా లక్ష్మీనారాయణ దారెటు

Kanna Lakshminarayana Fate మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ గుడ్ బై చెప్పేశారు. రాజకీయ భవిష్యత్తుపై రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. కన్నా దారి ఎటువైపనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. కన్నా జనసేన వైపు వెళ్తారని ప్రచారం జరిగినా, అలా జరగకపోవచ్చని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కన్నా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేశారు. వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్ కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌లలో ఓ వెలుగు వెలిగారు. రాష్ట్ర విభజన సమయంలో రాజకీయ సందిగ్ధత నెలకొన్న సమయంలో ఓ దశలో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా కన్నా పేరు తెరపైకి వచ్చింది. కిరణ్ కుమార్‌ రెడ్డి స్థానంలో కన్నా లక్ష్మీనారాయణకు సిఎంగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది.

రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదనుకున్న నాయకులు అంతా చెల్లాచెదురయ్యారు. కన్నా కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరిపోయారు. దాదాపు 9ఏళ్లుగా బీజేపీలో ఉంటున్నారు. 2014, 2019లో ఆ‍యనకు ఎలాంటి పదవులు దక్కలేదు. 2019లో ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. అయితే నాటి ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలవకపోవడానికి కన్నాను పార్టీ బాధ్యుడ్ని చేసింది. 2018లో అప్పగించిన అధ్యక్ష బాధ్యతల నుంచి రెండేళ్లలోనే తప్పించింది. ఇది కన్నాను మొదట మనస్తాపానికి గురి చేసింది.

ఎన్నికలకు పది నెలల ముందు మాత్రమే తనకు బాధ్యతలు అప్పగించినా శక్తివంచన లేకుండా శ్రమించానని, ఓటమికి మాత్రం తనను బాధ్యుడ్ని చేశారని కన్నా ఆరోపించారు. మరోవైపు ఏపీలో బీజేపీని ఎదగకుండా చేయడంలో సొంత పార్టీ నేతలే కారణమని ఎప్పటి నుంచో కన్నా ఆరోపిస్తున్నారు.

2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీతో రాజకీయ పొత్తు కుదుర్చుకుంటున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పు జరగడంతో రెండు పార్టీలు కలిసి ఒక్కసారి కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. బీజేపీ-జనసేన బంధం బలపడకపోవడానికి కూడా సోము వీర్రాజే కారణమని కన్నా ఆరోపిస్తున్నారు

జనసేన పిఏసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరపడంతో ఆ పార్టీలో చేరుతారని విస్తృత ప్రచారం జరిగింది. తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కన్నా టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. జనసేన కంటే టీడీపీతో కలిసి సాగడమే నయమని కన్నా భావిస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ తరపున గెలిచిన మద్దాలి గిరి వైసీపీ వైపు వెళ్లిపోయారు. దీంతో ఆ స్థానం నుంచి కన్నా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు జనసేనకు సంస్థాగతంగా బలం లేకపోవడంతో, టీడీపీకి బలమైన క్యాడర్ ఉండటంతో టీడీపీ వైపు కన్నా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను గెలిచి తీరాలనే నిర్ణయంతోనే టీడీపీ జెండా కప్పుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్