Tirumala Special Days 2025 : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఏప్రిల్ నెలలో జరిగే విశేష ఉత్సవాలివే
Tirumala Tirupati Devasthanam Updates: ఏప్రిల్ నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.. ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం ఉండనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏప్రిల్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం ఉంటుందని పేర్కొంది. ఏప్రిల్ 10 నుంచి 12వ తేది వరకు వసంతోత్సవాలు ఉంటాయని ప్రకటించింది. ఇవే కాకుండా మరికొన్ని వేడుకల వివరాలను టీటీడీ వెల్లడించింది.
ఏప్రిల్ నెలలో జరిగే విశేష పర్వదినాలు:
- ఏప్రిల్ 6న శ్రీరామనవమి ఆస్థానం.
- ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం.
- ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి.
- ఏప్రిల్ 10 నుండి 12వ తేది వరకు వసంతోత్సవాలు.
- ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి.
- ఏప్రిల్ 23న భాష్యకార్ల ఉత్సవారంభం.
- ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి.
- ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితులు వర్ష తిరు నక్షత్రం, అక్షయ తృతీయ.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు:
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంంబధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
- ఏప్రిల్ 3న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామి వారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
- ఏప్రిల్ 4, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
- ఏప్రిల్ 6న శ్రీ రామనవమి సందర్భంగా సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీపట్టాభిరామస్వామి వారు మాడ వీధుల్లో భక్తులకు అభయమిస్తారు.
- ఏప్రిల్ 12న పౌర్ణమి మరియు ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
- ఏప్రిల్ 22వ తేదీ శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు శ్రీభూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
- ఏప్రిల్ 23 నుండి మే 2వ తేదీ వరకు భాష్యకార్ల ఉత్సవం నిర్వహించనున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 4, 11, 18, 25వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారని టీటీడీ ప్రకటించింది.