Vijayawada : సరస్వతీదేవి అలంకారంలో దుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై విద్యార్థులకు ప్రత్యేక దర్శనం
Vijayawada : బెజవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీన విద్యార్థులకు ఉచిత దర్శనం సౌకర్యం కల్పించారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ.. మాఘ శుద్ధ పంచమి సందర్బంగా సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడో తేదీ ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పించి.. పెన్నులు అందజేస్తారు.

విద్యార్థులకు సూచనలు..
అమ్మవారి దర్శనం కోసం వచ్చే విద్యార్థులు స్కూల్, కాలేజీ యూనిఫాం ధరించి, ఐడీ కార్డు తీసుకురావాలని ఆలయ అధికారులు సూచించారు. పెన్నుతో పాటు అమ్మవారి రక్ష కంకణం, పాకెట్ సైజు ఫొటో, ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. సుమారు 40 వేల మంది విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు..
సరస్వతీ యాగం..
సరస్వతీదేవి జయంతిని పురస్కరించుకుని.. మూలవిరాట్ తోపాటు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని.. విశేషంగా అలంకరిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు పంపిణీ చేసే పెన్నులు, కంకణాలను ఆలయ మూలవిరాట్ వద్ద ఉంచుతారు. దేవస్థానం యాగశాలలో సరస్వతీ యాగాన్ని నిర్వహించేందుకు వైదిక కమిటీ ఏర్పాట్లు చేసింది.
ఆలయ ఉద్యోగులపై ఆరోపణలు..
ఇటీవల అమ్మవారి ఆలయ ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్నాయి. వీఐపీ దర్శనం చేయిస్తామని కొందరు ప్రైవేట్ వ్యక్తులు భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వీరికి ఆలయ ఉద్యోగులు, సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వాటాలు తీసుకొని.. వారికి సహకరిస్తున్నారని తెలుస్తోంది. రద్దీ వేళల్లోనూ అరగంటలో దర్శనం చేయిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆలయ ఆదాయానికి గండి..
తాజాగా ఏఈవో తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. హారతుల దర్శనాల్లోనూ ఇదేతీరు ఉందని గుర్తించారు. టికెట్ కొనుగోలుదారుల కంటే.. ఇలా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందా కారణంగా ఆలయ ఆదాయానికి గండి పడిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.