AP Inter Colleges : ఏపీ ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు - మారిన టైమింగ్స్, వివరాలివే-special classes in government and aided inter colleges in andhrapradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Inter Colleges : ఏపీ ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు - మారిన టైమింగ్స్, వివరాలివే

AP Inter Colleges : ఏపీ ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు - మారిన టైమింగ్స్, వివరాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 16, 2024 10:13 AM IST

ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఉత్తర్వులను ఇచ్చింది. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న సమయం మాత్రమే కాకుండా… ఒక గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. దీంతో సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలు పని చేయనున్నాయి.

ఏపీ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు
ఏపీ ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక తరగతులు

రాష్ట్రంలో ప్ర‌భుత్వ జూనియ‌ర్‌, ఎయిడెడ్ కాలేజీల స‌మ‌యాలు మారాయి. ఇవాళ్టి నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న టైమింగ్స్ మారాయి.

గంట పాటు ప్రత్యేక తరగతులు…

నిన్నటి వరకు ఇంటర్ కాలేజీలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు నిర్వహించేవారు. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలతో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఫలితంగా సాయంత్రం 4 నుంతి 5 గంటల వరకు కాలేజీలు పని చేస్తాయి. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నారు.

గ‌తేడాది ఫ‌లితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించ‌క‌పోవ‌డంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు టైమ్ టేబుల్స్‌ను కూడా సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా… అన్ని ప్ర‌భుత్వ, ఎయిడెడ్ ఇంట‌ర్మీడియేట్ కాలేజీలు పని చేయనున్నాయి.

అక్టోబర్ 21 వ‌ర‌కు త్రైమాసిక ప‌రీక్ష‌లు

రాష్ట్రవ్యాప్తంగా ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు అక్టోబ‌ర్ 15 నుంచి త్రైమాసిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. 21 వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌ల‌ు జరగనున్నాయి. మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంటల నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు పరీక్షలు రాస్తారు. రెండో సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తారు.

మరోవైపు ఏపీ ఇంటర్ బోర్డు విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని విద్యార్థులకు ఉచిత ఐఐటీ, నీట్‌ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మొదటి విడతలో రాష్ట్రంలోని నాలుగు ముఖ్య పట్టణాల్లో ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి, వాటి పరిధిలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో ఎంపిక చేసిన కాలేజీల్లో... అక్కడి జూనియర్ లెక్చరర్లు విద్యార్థులకు ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు. ఈసారి నారాయణ కాలేజీలకు చెందిన ఐఐటీ, నీట్‌ సిలబస్‌ బోధించే సిబ్బందితో ఈ శిక్షణ ఇప్పించాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

మొదటి విడతలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఈ నగరాలకు 5 లేదా 10 కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు.

ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచితంగా నీట్, ఐఐటీ శిక్షణ ఇస్తారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు నిర్ణీత సెంటర్‌లో ఇంటర్‌ రెగ్యులర్‌ తరగతులతో పాటు ఐఐటీ, నీట్‌ శిక్షణను పొందుతారు. ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తారు. దీంతో అటెండెన్స్‌ ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది.

గతంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు ఇలాంటి తరహాలో నీట్, ఐఐటీ శిక్షణను ఇంటర్‌ బోర్డు ఇచ్చింది. ఆసక్తి ఉన్న ప్రభుత్వ లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. అయితే ఈ విధానం అంతగా ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది శిక్షణ విధానం మార్చారు. ఆసక్తి గల విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపికైన వారికి ఐఐటీ, నీట్‌ శిక్షణను నారాయణ విద్యాసంస్థల సిబ్బంది ఇస్తారు.

Whats_app_banner