AP TG Weather Updates: పగలు ఎండలు, సాయంత్రం వర్షాలు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు, రైతులకు ఐఎండి తీపికబురు
AP TG Weather Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. పగలు అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రానికి కారుమబ్బులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది మే మొదటి వారం నుంచి మండే ఎండల నుంచి అల్పపీడన ప్రభావంతో ప్రజలకు ఉపశమనం లభించింది.
AP TG Weather Updates: రోకళ్ళు పగిలే రోహిణి కార్తెలో సైతం ఈ ఏడాది వానలు కురిశాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఏడాది భిన్నమైన వాతావరణం కనిపించింది. ఏప్రిల్, మే నెల మొదటి వారం వరకు ఎండలు మండిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులతో వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు కాస్త ఊరట దక్కింది. ఏకబిగిన ఎండలు దంచి కొట్టకపోవడంతో జనం కాస్త సేదతీరారు. అకాల వర్షాల కారణంగా విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గింది. లేకుంటే డిమాండ్ తగ్గట్టు ఉత్పత్తి చేయలేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది.

మరోవైపు రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో దక్షిణాదిన జలాశయాలన్నీ అడుగంటాయి. డెడ్ స్టోరేజీలలో ఉన్న కొద్దిపాటి నీటినే జాగ్రత్తగా వాడుకుంటున్నారు. కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నీరు వచ్చే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలో దేశంలో ఈసారి సగటున సాధారణం కంటే అధిక వర్షపాతానికి అవకాశాలున్నట్లు పేర్కొంది. ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువగా, వాయవ్య ప్రాంతంలో సాధారణంగా, మిగతా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా పడతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర సోమవారం ప్రకటించారు.
దేశంలో గత కొన్ని నెలలుగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావం, వడగాడ్పులు, ఎండ తీవ్రతతో చాలా ప్రాంతాలు అల్లాడుతున్నాయి. మే రెండోవారంలోనే మలబార్ తీరంలో వర్షాలు మొదలైనా అవి ఇంకా విస్తరించలేదు. నైరుతి రుతపవనాల గమనంపై రైతాంగానికి ఐఎండి తీపి కబురు చెప్పింది.
ఈ ఏడాది మే 31వ తేదీనే కేరళను రుతుపవనాలు తాకుతాయని అంచనావ వేశారు. ప్రస్తుతం కేరళ తీరంతో పాటు అరేబియా సముద్రంలో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో ఐదు రోజుల పాటు కొనసాగనున్నాయి.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ ఏడాది 106 శాతం నాలుగు శాతం అటుఇటుగా) వర్షపాతం నమోదు కానుంది. జూన్‌లో దక్షిణ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదు కానుంది. వాయువ్య, ఈశాన్య, తూర్పు భారతంలోని పలు ప్రాంతాలు, తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్‌లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కానున్నాయి.
తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు…
తెలంగాణ పశ్చిమ, వాయవ్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో నేడు, రేపు పొడి వాతావరణం ఉండనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉంటాయి. సోమవారం జగిత్యాల జిల్లా జైనలో 46.5, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో ఎండ తక్కువగా ఉన్నా ఉక్కపోత కారణంగా ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు మహబూబాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లో సోమవారం సాయంత్రం ఆకస్మికంగా కురిసిన వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. సాయంత్రం ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. చెట్లు నేల కూలడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రెమాల్ తుఫాను బలహీనపడటంతో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో ఎండల ప్రభావం…
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బలహీన పడటంతో ఏపీలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని విపత్తులు నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సోమవారం రాష్ట్రంలోని 149మండలాల్లో తీవ్రవడగాల్పులు, 160మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 195 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 147మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలోని శ్రీకాకుళం 22, విజయనగరం27, పార్వతీపురంమన్యం 15, అల్లూరి 2, విశాఖ6, అనకాపల్లి 20, కాకినాడ 18, కోనసీమ 7, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 4, ఏలూరు 7, కృష్ణా 2, బాపట్ల కొల్లూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (160):
శ్రీకాకుళం 8, అల్లూరి 8, విశాఖ 2, అనకాపల్లి 2, కాకినాడ 3, కోనసీమ8, తూర్పుగోదావరి 1, పశ్చిమగోదావరి 13, ఏలూరు 21, కృష్ణా 19, ఎన్టీఆర్ 17, గుంటూరు 17, పల్నాడు 15, బాపట్ల 20, ప్రకాశం 6 మండలాల్లో మంగలవారం వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
సత్యవేడులో అధికం…
సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9°డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5°డిగ్రీలు, బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9°C, అల్లూరి జిల్లా చింతూరులో 40.8°డిగ్రీలు, పల్నాడు జిల్లా నాదెండ్ల, విజయనగరం జిల్లా డెంకాడలో 40.7°డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 40.4°డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 40°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.